అమెరికాలోని షికాగోలో జరుగుతున్న డెమొక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్ మూడో రోజు కార్యక్రమం శాంతిమంత్రం పారాయణంతో ప్రారంభమైంది. మేరీల్యాండ్‌లోని శివ-విష్ణు ఆలయం పూజారి రాకేష్ భట్ సంప్రదాయిక వైదిక మంత్రోచ్చారణలతో ఆ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సంస్కృతంలో మంత్రాలు చదువుతూ ఆంగ్లంలో వాటి అర్ధం వివరించారు. ఐకమత్యం, సమీకృత భావనలను ప్రోత్సహించే హిందూ ధార్మిక విధానాల గురించి వివరించారు.
మాధ్వ సంప్రదాయానికి చెందిన రాకేష్ భట్ సమైక్య అమెరికా కోసం ప్రార్థన చేసారు. భిన్నత్వాలు ఉన్నప్పటికీ సామరస్యంగా ఉండవలసిన ప్రాధాన్యతను వివరించారు. ‘‘మన మనసులు ఒకేలా ఆలోచించాలి. మన హృదయాలు ఒకేలా స్పందించాలి. సమాజం మెరుగుదల కోసమే అందరం కలిసి ఉండాలి. మన ఐకమత్యమే మనను శక్తివంతులను చేస్తుంది, మన దేశాన్ని గర్వపడేలా చేస్తుంది’’ అంటూ తన ప్రార్ధన సారాంశాన్ని వివరించారు.
ఈ ప్రపంచం అంతా ఒకే కుటుంబం – ‘వసుధైవ కుటుంబకం’ అన్న భారతీయ వైదిక భావనను రాకేష్ భట్ వివరించారు. ‘ఈ ప్రపంచంలో మనమంతా ఒకే కుటుంబం. సత్యమే మనకు పునాదిగా ఉండాలి. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతిఃశాంతిఃశాంతిః’ అంటూ ఆయన తన వైదిక పూజా కార్యక్రమాన్ని ముగించారు.
డెమొక్రటిక్ పార్టీ తాము దేశప్రజల భిన్నత్వానికి కట్టుబడి ఉన్నామని చెప్పడానికి ప్రతీకగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది. రాబోయ అమెరికా ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధిగా కమలా హ్యారిస్ పోటీ చేస్తున్నారు. పాక్షికంగా భారతీయ మూలాలు కలిగిన కమల, అమెరికాలో ఓటుహక్కు కలిగిన ప్రవాస భారతీయులను ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే డెమొక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్ సమావేశంలో హిందూ ధర్మానికి చెందిన వైదిక పూజావిధానాన్ని అనుసరించారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు