స్వల్ప గాయాలైతే రూ. 25 లక్షల పరిహారం
ప్రమాద ఘటనపై ప్రధాని విచారం, సాయం ప్రకటన
అచ్యుతాపురం సెజ్ ప్రమాద బాధితులను ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు. విశాఖపట్నం మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులతో పాటు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వైద్యులను అడిగి చికిత్స వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదంలో గాయపడిన ప్రతీ ఒక్కరూ కోలుకునేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు.
అనంతరం ఆస్పత్రి ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ ప్రమాద ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ. 50 లక్షల పరిహారం అందజేస్తామన్నారు. స్వల్ప గాయాలైన వారికి రూ.25లక్షల చొప్పున సాయం అందిస్తామని చెప్పారు.
ఎంత ఖర్చు అయినా బాధితులందరికీ ఉత్తమ వైద్య సేవలందిస్తామని హామీ ఇచ్చారు. అవసరమైన వారికి ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయిస్తామన్నారు.భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని వివరించారు. గత ఐదేళ్ళలో అన్ని వ్యవస్థలు నాశనమయ్యాయని దాని పర్యవసానమే ఈ ప్రమాదం అని సీఎం తెలిపారు.
ప్రమాద ఘటన సమాచారం అందిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున సాయం అందజేయనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది. ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ సంతాపాన్ని తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో భారీ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోగా, 60 మందికి పైగా గాయపడ్డారు.