దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా ఆర్జీ కర్ ఆసుపత్రి డాక్టర్ హత్య అత్యాచార ఘటనను నిరసిస్తూ డాక్టర్లు చేపట్టిన సమ్మెను విరమించాలని సుప్రీంకోర్టు సూచించింది. విధుల్లో డాక్టర్ల సమస్యలను తాను స్వయంగా చూశానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై.చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. ఒక్కోసారి డాక్టర్లు వరుసగా 36 గంటలు విధులు నిర్వహించాల్సి వస్తోందని ప్రధానన్యాయమూర్తి గుర్తుచేశారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అందకపోతే దేశ వ్యాప్తంగా పేదలు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతారని వెంటనే డాక్టర్లు సమ్మె విరమించి విధుల్లో చేరాలని సుప్రీంకోర్టు కోరింది. డాక్టర్లపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా మేం చూసుకుంటామని సుప్రీంకోర్టు భరోసా ఇచ్చింది.
ఆగష్టు 9న ఆర్జీ కర్ ఆసుపత్రిలో డాక్టర్ హత్య, అత్యాచార ఘటన తరవాత దేశ వ్యాప్తంగా డాక్టర్లు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. కేవలం అత్యవసర సేవలు మాత్రమే అందిస్తున్నారు. దీంతో పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వెంటనే విధుల్లో చేరాలని డాక్టర్లను కోరింది.