కోల్‌కతాలోని ఆర్.జి. కర్ ఆస్పత్రిలో 31ఏళ్ళ వైద్యురాలి హత్య, అత్యాచార ఘటన తర్వాత మెడికోల ఆందోళనలతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దిగొచ్చింది. ఆస్పత్రి యాజమాన్య విధులు నిర్వహించే టాప్ పోస్టుల్లో పలు మార్పులు చేసింది.
అత్యాచార ఘటన తర్వాత డాక్టర్ సందీప్ ఘోష్‌ను ప్రిన్సిపాల్ పదవి నుంచి తప్పించారు. ఆయన స్థానంలో నియమించిన డాక్టర్ సుహృతా పాల్‌ను కూడా తప్పించి తాజాగా డాక్టర్ మానస్ కుమార్ బందోపాధ్యాయను కొత్త ప్రిన్సిపాల్‌గా నియమించారు. ఆయన అంతకుముందు ప్రిన్సిపాల్‌గా ఉన్న బరాసాత్ ప్రభుత్వ వైద్య కళాశాల, ఆస్పత్రికి సుహృతా పాల్‌ను ప్రిన్సిపాల్‌గా నియమించారు.
ఆర్.జి.కర్ మెడికల్ కాలేజ్ మెడికల్ సూపరింటెండెంట్‌గా ప్రొఫెసర్ డాక్టర్ బుల్‌బుల్ ముఖోపాధ్యాయను తొలగించి, ప్రొఫెసర్ డాక్టర్ సప్తర్షి ఛటర్జీని నియమించారు.
ఆర్.జి.కర్ మెడికల్ కాలేజ్‌లో ఛాతీ చికిత్స విభాగం హెడ్‌గా ప్రొఫెసర్ డాక్టర్ అరుణాభ దత్తా చౌధురిని తొలగించారు. హత్యాచార బాధితురాలు ఆ విభాగంలోనే పోస్ట్‌గ్రాడ్యుయేట్ ట్రయినీగా ఉండేది.
బుధవారం ఆర్.జి.కర్ కళాశాల విద్యార్ధులు, సీనియర్ డాక్టర్లు కోల్‌కతాలోని సిబిఐ కార్యాలయం నుంచి రాష్ట్ర వైద్య విభాగం ప్రధాన కార్యాలయం స్వాస్థ్య భవన్ వరకూ ఆందోళన ప్రదర్శన చేపట్టారు. వారి ప్రతినిధుల బృందం వైద్య విభాగం అధికారులను కలిసారు. ప్రిన్సిపాల్‌ను తొలగించడం సహా పలు డిమాండ్లు చేసారు.
సందీప్ ఘోష్‌ను కలకత్తా నేషనల్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ప్రిన్సిపల్‌గా నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను సైతం రాష్ట్రప్రభుత్వం రద్దు చేసింది. ఆయనను ఆర్.జి కర్ కళాశాల ప్రిన్సిపల్ పదవి నుంచి కలకత్తా కళాశాలకు బదిలీ చేయడంపై మమతా బెనర్జీ ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కోవలసి వచ్చింది. కోర్టులు సైతం ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టడంతో, మమత సర్కారుకు మరో దారి లేకపోయింది.
ఆగస్టు 9న ఆర్.జి.కర్ ఆస్పత్రి సెమినార్ హాల్‌లో 31ఏళ్ళ వైద్యురాలి మృతదేహం కనిపించడం, ఆమెపై అత్యాచారం జరిగినట్లు వైద్యపరీక్షలో నిర్ధారణ అవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ కేసులో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని, నేషనల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసింది. విధి నిర్వహణలో ఉన్న హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్ భద్రతకు తగిన చర్యలను సిఫారసు చేయడం ఆ టాస్క్‌ఫోర్స్ విధి.
మరోవైపు, కేసు విచారణలో కోల్‌కతా పోలీసుల పనితీరు సరిగ్గా లేదని ఆక్షేపిస్తూ కలకత్తా హైకోర్టు ఆ కేసును సిబిఐకి అప్పగించింది. కలకత్తా పోలీసులు ఒక పౌర వాలంటీరును అరెస్ట్ చేసారు, అంతకుమించి ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో దర్యాప్తు తాజా స్థితి మీద సిబిఐ సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది.