తమిళ సినీ పరిశ్రమలో అగ్ర హీరోగా ఉన్న విజయ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అధికారికంగా అడుగుపెట్టారు. తమిళగ వెట్రి కళగం(TVK) పేరుతో రాజకీయ పార్టీని స్థాపించిన విజయ్, తాజాగా పార్టీకి చెందిన జెండాను ఆవిష్కరించారు. చెన్నైలో జరిగిన కార్యక్రమంలో పార్టీ జెండాను విజయ్ ఎగురవేశారు. కార్యక్రమంలో భారీ సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.
జెండా లో ఎరుపు, పసుపు రంగులతో పాటు జెండా మధ్యలో సూర్యకిరణాలు, పక్కనే రెండు ఏనుగులు అటూ, ఇటూ ఉన్నాయి.
తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించిన విజయ్, స్వాతంత్య్రం కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన యోధులను, రాష్ట్ర హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన అసంఖ్యాక సైనికులను ఎప్పటికీ గుర్తించుకుంటామన్నారు. కులం, మతం, లింగం, ప్రాంతం పేరుతో జరుగుతున్న వివక్షను తొలగించి అందరికీ సమాన హక్కులు, అవకాశాల కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. సమానత్వం అనే సూత్రాన్ని బలంగా సమర్ధిస్తామన్నారు. త్వరలో తిరుచ్చిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. తమిళనాడులో 2026 లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి.