ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలనే నిబంధనను అమలు చేయడంలో ట్రాఫిక్ పోలీసులు విఫలమయ్యారని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. మోటారు వాహన చట్టం నిబంధనలు పాటించేలా ఆదేశించాలని కోరుతూ న్యాయవాది యోగేష్ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఎలక్ట్రానిక్ విజిలెన్స్ ఉండాలని ఆయన పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ వెంకట జ్యోతిర్మయితో కూడిన ధర్మాసనం, కీలక వ్యాఖ్యలు చేసింది.
99 శాతం మంది హెల్మెట్ ధరించకుండానే ద్విచక్ర వాహనాలు నడుపుతున్న విషయాన్ని తాము గమనించామని ధర్మాసనం తెలిపింది. హెల్మెట్ ధారణ తప్పనిసరి చేయాలని గతంలో
హైకోర్టు జారీ చేసిన ఆదేశాలు అమలు చేయాల్సిందేనని మరోసారి స్పష్టం చేసింది. తాము ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత ఎంత మంది ప్రమాదాల్లో మరణించారు? ఇప్పటి వరకూ ఎన్ని చలనాలు విధించారు? తదితర వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీలను ధర్మాసనం ఆదేశించింది. అనంతరం విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.