అనకాపల్లి సెజ్‌లోని ఎసెన్సియా అడ్వాన్సుడ్ సైన్సెస్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి పరిహారం ప్రకటించారు. విశాఖ జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఒక్కో కుటుంబానికి కోటి పరిహారం ఇవ్వాలని నిర్ణయించినట్లు కలెక్టర్ ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన ఉచిత వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇవాళ ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి, క్షతగాత్రులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరామర్శించనున్నారు.
ప్రమాద ఘటనపై కార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి. ఇవాళ ముఖ్యమంత్రి పర్యటన ఖరారు కావడంతో కార్మిక సంఘాల నేతలతో కలెక్టర్ చర్చలు జరిపారు. మృతులకు భారీ పరిహారం ఇవ్వడంతోపాటు, గాయపడిన వారి చికిత్సకు మొత్తం ఖర్చు భరిస్తామని భరోసా ఇచ్చారు. అనకాపల్లి ఫార్మా సెజ్‌లో తరచూ ప్రమాదాలు జరగడంపై కార్మిక సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.