భారత్-పోలండ్ దేశాల మధ్య సామాజిక భద్రత ఒప్పందం కుదిరిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. శుద్ధ ఇంధనం, న్యూ టెక్నాలజీ వంటి రంగాల్లో ఇరుదేశాల మధ్యా భాగస్వామ్యం బలోపేతమవుతోందని చెప్పారు. రెండు దేశాల మధ్యా సంబంధాలు పెరగడానికి కబడ్డీ దోహదపడుతోందని మోదీ వ్యాఖ్యానించారు. పోలండ్ ఈ యేడాది మొదటిసారి కబడ్డీ ఛాంపియన్‌షిప్‌కు ఆతిథ్యం ఇస్తోంది.
పోలండ్ రాజధాని వార్సాలో భారత సంతతి వారితో నరేంద్రమోదీ భేటీ అయ్యారు. ఆ సందర్భంగా మాట్లాడినప్పుడు రెండు దేశాల మధ్యా సామాజిక భద్రత ఒప్పందం కుదిరిందనీ, దానివల్ల ప్రవాస భారతీయులకు మేలు కలుగుతుందనీ చెప్పారు.
నరేంద్రమోదీ పోలండ్ ప్రధానమంత్రి డొనాల్డ్ టస్క్‌తోనూ, అధ్యక్షుడు అంద్రేజ్ దూడాతోనూ సమావేశం కానున్నారు. ఆ సమావేశాల వల్ల భారత్-పోలండ్ భాగస్వామ్య బంధం మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు. భారత్-పోలండ్ మధ్య ఎన్నో పోలికలున్నాయనీ వాటిలో ప్రధానమైనది ప్రజాస్వామ్యమనీ చెప్పారు.
బుధవారం పోలండ్ చేరుకున్న నరేంద్రమోదీ, ఆ దేశంలో గత 45ఏళ్ళలో పర్యటించిన మొట్టమొదటి భారత ప్రధానమంత్రి. పోలండ్ పర్యటన పూర్తయాక మోదీ శుక్రవారం నాడు అక్కడినుంచి రైల్లో ఉక్రెయిన్ వెడతారు కీవ్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో చర్చలు జరుపుతారు. సోవియట్ యూనియన్ నుంచి ఉక్రెయిన్ విడిపోయిన 1991 తర్వాత భారత ప్రధాని ఆ దేశంలో పర్యటించడం ఇదే మొదటిసారి. రష్యా-ఉక్రెయిన్ ఘర్షణల నేపథ్యంలో ఆ దేశంలో శాంతి సుస్థిరతలు నెలకొనాలని మోదీ ఆకాంక్షించారు.