అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఒక ఫార్మా కంపెనీలో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఆ ప్రమాదంలో 17 మంది దుర్మరణం పాలయ్యారు. 60మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన బుధవారం మధ్యాహ్నం జరిగింది. అయితే పైకప్పు కూలడంతో దానికింద పలువురు మరణించి ఉండవచ్చని కంపెనీ ప్రతినిధులు చెప్పడంతో శిథిలాలను తొలగించి మృతదేహాలను బైటకు తీసేసరికి రాత్రి అయిపోయింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ఉదయం కేజీహెచ్‌లో బాధితులను పరామర్శిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దుర్ఘటన బాధితులకు పరిహారం ప్రకటించారు.
ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ఫార్మా కంపెనీలో బుధవారం మధ్యాహ్నం ఒక రియాక్టర్ పేలిపోయింది. దాని తీవ్రతకు ఏసీ యూనిట్లకు మంటలు అంటుకుని వేగంగా వ్యాపించాయి. పేలుడు తీవ్రతకు కంపెనీ పైకప్పు కూలిపోయింది. కార్మికులు సైతం ఎగిరి పడిపోయారు. మంటలను అదుపు చేయడానికి ఆరు అగ్నిమాపక వాహనాలు నిరంతరాయంగా పనిచేసాయి. ఎత్తయిన భవనంలో మంటలు వ్యాపించడంతో పైనున్న వారిని కిందకు దించడం కష్టమైంది. ఉదయం షిఫ్ట్ ముగిసి, మధ్యాహ్నం షిఫ్ట్ ప్రారంభమయ్యే సమయంలో ఈ ప్రమాదం జరగడంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగింది.
విషయం తెలిసిన వెంటనే కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పి దీపికా పాటిల్ ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. స్వయంగా సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రమాద సమయంలో కర్మాగారంలో 381మంది ఉన్నారని తేలింది. ఎన్డిఆర్ఎఫ్ బృందాలు వేగంగా ప్రమాదస్థలానికి చేరుకున్నాయి. శిథిలాలను తొలగించి, వాటికింద చిక్కుకున్న కార్మికులను బైటకు తీసాయి. మృతదేహాలను విశాఖపట్నం కెజిహెచ్‌కు తరలించారు. గాయపడిన వారిని కెజిహెచ్, అచ్యుతాపురం, అనకాపల్లి, విశాఖపట్నంలలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు. వారికి చికిత్స అందిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఉదయం కెజిహెచ్‌ను సందర్శిస్తారు. బాధితులను, మృతుల కుటుంబాలనూ పరామర్శిస్తారు. విదేశీ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ.50వేలు పరిహారం ప్రకటించారు.