రిజర్వుడు కేటగిరీల్లో సబ్-కోటాల ఏర్పాటుకు వీలు కల్పిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ‘రిజర్వేషన్ బచావో సంఘర్ష్ సమితి’ ఇవాళ భారత్ బంద్ నిర్వహించింది. సుప్రీంకోర్టు ఆగస్టు 1న ఇచ్చిన తీర్పులో ఎస్సీ, ఎస్టీ కేటగిరీల్లో అవసరం ఎక్కువ ఉన్నవారిని గుర్తించి రాష్ట్రప్రభుత్వాలు వారికి ప్రాధాన్యత ఇవ్వవచ్చునని చెప్పింది.
ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ దళిత్ అండ్ ఆదివాసీ ఆర్గనైజేషన్స్ (ఎన్ఎసిడిఎఒఆర్) వ్యతిరేకిస్తోంది. భారతదేశంలో రిజర్వేషన్లకు ఒక రూపం తెచ్చిన ఇందిరా సాహ్నీ కేసులో తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పును తాజా తీర్పు బలహీనపరుస్తోందని ఆ సంస్థ ఆరోపిస్తోంది. ఆ సందర్భంగా రిజర్వేషన్ల వర్గీకరణ గురించి తెలుసుకుందాం.
1. అసలు, ‘ వర్గీకరణ లేదా కోటాలో కోటా’ అంటే ఏమిటి?
ఇప్పటికే అమల్లో ఉన్న రిజర్వేషన్ కోటాల్లో నిర్దిష్టమైన ఉపవర్గాలకు లబ్ధిని మరింత చేరువ చేయడాన్నే స్థూలంగా ‘కోటాలో కోటా’ అని చెప్పవచ్చు. ఉదాహరణకి ఎస్సీ లేదా బీసీ రిజర్వేషన్‌లో కొన్ని ఉపకులాలకు ఇప్పటివరకూ రిజర్వేషన్ ఫలాలు అందకపోయి ఉండవచ్చు. అలాంటి ఉపకులాలను గుర్తించి వారికి ప్రత్యేకంగా కొంత రిజర్వేషన్‌ను అమలు చేయవచ్చు. దానివల్ల ఆయా కేటగిరీల్లో అత్యంత బలహీన వర్గాలకు ప్రయోజనం వాటిల్లుతుంది. సాధారణంగా ఒక కేటగిరీలో ఎక్కువ రిజర్వేషన్ ఫలాలు అనుభవించే ఉపకులం కంటె తక్కువ ప్రయోజనాలు పొందే ఉపకులానికి ఈ పద్ధతి వల్ల లాభం చేకూరుతుంది.
2. కోటాలో కోటా గురించి సుప్రీంకోర్టు ఏం తీర్పు చెప్పింది?
ఎస్సీలు, ఓబీసీల వంటి రిజర్వుడు కేటగిరీల్లో ఉప-కోటాలను ఏర్పాటు చేయడానికి రాష్ట్రప్రభుత్వాలకు ఉన్న హక్కును సుప్రీంకోర్టు 2024 ఆగస్టు 1న సమర్ధించింది. రిజర్వుడు కోటాలో కొంత వాటాను నిర్దిష్ట ఉపకులాలకు కేటాయించే వెసులుబాటును రాష్ట్రప్రభుత్వాలకు కల్పించింది. అయితే, అలాంటి విభజన అవసరాన్ని నిరూపించగల కనీస ప్రాథమిక సమాచారం ఉండడం తప్పనిసరి. దాంతోపాటు, ఆయా కేటగిరీల్లో సామాజిక, విద్యాపరమైన వెనుకబాటుతనం ఎంతుందనే విషయాన్ని జాగ్రత్తగా మదింపు చేయాలి. అలాంటి సమాచారం ఆధారంగానే వర్గీకరణ చేయాలని స్పష్టం చేసింది. కేటగిరీల వర్గీకరణను సమానత్వ సాధనలో భాగంగా ఒక ముందడుగుగానే చూడాలి తప్ప సమానత్వాన్ని ధిక్కరించే ప్రయత్నంగా భావించకూడదని న్యాయస్థానం స్పష్టం చేసింది. దీనివల్ల రిజర్వేషన్ల పరిధి మరింత విస్తృతమవుతుంది, దాని ఫలాలు నిజంగా అవసరమైన వారికి అందుతాయి.
3. రిజర్వేషన్ల వర్గీకరణ లేదా కోటాలో కోటా కేసు సుప్రీంకోర్టు ముందుకు ఎలా వచ్చింది?
1975లో పంజాబ్‌లో జ్ఞానీ జైల్‌సింగ్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీలకు రిజర్వు చేసిన సీట్లలో సగానికి సగం మజహబీ సిక్కులు, వాల్మీకి కులస్తులకు ఇచ్చేయాలని నిర్ణయించుకుంది. ఆ నిర్ణయం 2006వరకూ కొనసాగింది. ఆ యేడాది పంజాబ్ అండ్ హర్యానా కోర్టు దాన్ని నిలువరించింది. దాంతో పంజాబ్‌లో పెద్ద ఉద్యమమే మొదలైంది. ఫలితంగా అమరీందర్ సింగం నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పంజాబ్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్ అండ్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ (రిజర్వేషన్ ఇన్ సర్వీసెస్) యాక్ట్ 2006 అనే చట్టం చేసింది. 2010లో చమార్ మహాసభకు చెందిన దేవీందర్ సింగ్ ఆ చట్టంలోని 50శాతం కోటా కేటాయింపులను సవాల్ చేసాడు. దాంతో హైకోర్టు ఆ చట్టంలోని సంబంధిత సెక్షన్ 4(5) మీద స్టే విధించింది. పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళింది. అక్కడ ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం కేసును ఫిబ్రవరి 2024 నుంచీ విచారించింది. కోటాలో కోటా సృష్టించడానికి (రిజర్వేషన్‌లో వర్గీకరణ చేసుకోడానికి) రాష్ట్రాలకు స్వాతంత్ర్యం ఉందంటూ ఆగస్టు 1న తీర్పు చెప్పింది. అలా కోటాల వల్ల లబ్ధి పొందుతున్న కులాలు ఏమిటన్న విషయాన్ని కోర్టు సమీక్షించవచ్చు.
3. ఈ అంశంపై భారత్‌బంద్ దేనికి?
ఓబీసీ కేటగిరీలో ‘క్రీమీ లేయర్’ ఉండకూడదు, ఎష్సీ ఎస్టీ రిజర్వేషన్లలో క్రీమీ లేయర్‌ను అమలు చేయాలి అని వాదిస్తున్న వర్గాలే ప్రధానంగా ఈ భారత్‌బంద్‌ను చేపట్టాయి. అలాగే, సుప్రీంకోర్టు తాజా తీర్పు వల్ల రిజర్వేషన్లలో తమకు లబ్ధి తగ్గిపోతుందని కొన్ని వర్గాలు భయపడుతున్నాయి. బంద్ నిర్వాహకులు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో క్రీమీ లేయర్ నిబంధనను వర్తింపజేయకూడదని, అమల్లో ఉన్న రిజర్వేషన్ పద్ధతిని మార్చకూడదనీ డిమాండ్ చేస్తున్నారు.
4. భారత్‌బంద్ ఎవరు నిర్వహించారు, వారి డిమాండ్లు ఏమిటి?
ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో క్రీమీలేయర్ అమలును వ్యతిరేకించే కులసంఘాలు, రాజకీయ సంస్థలూ ఈ భారత్ బంద్ నిర్వహించాయి. వాటిలో ప్రధానమైనవి రిజర్వేషన్ బచావో సంఘర్ష్ సమితి, నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ దళిత్ అండ్ ఆదివాసీ ఆర్గనైజేషన్స్. కోటా వర్గీకరణ వల్ల తమకు రిజర్వేషన్ లాభాలు తగ్గిపోతాయన్న భయంతో ఆ ప్రక్రియను కూడా వారు వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళ ప్రధానమైన డిమాండ్లు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో క్రీమీ లేయర్‌ను అమలు చేయకూడదు, ఎలాంటి వర్గీకరణా లేకుండా ప్రస్తుతమున్న రిజర్వేషన్ పద్ధతిని యథాతథంగా అనుసరించాలి, ఎస్సీ ఎస్టీల్లోని అత్యంత బలహీన కులాలకు రిజర్వేషన్ ఫలాలు అందేలా చేయాలి.
5. బంద్‌ను వ్యతిరేకించే ఎస్సీ ఎస్టీల అభ్యంతరాలేమిటి?
ఆ కులాల వారి వాదన… వర్గీకరణ కోసం చాలాకాలం నుంచి రాజకీయంగానూ, చట్టపరంగానూ పోరాటం చేస్తుతున్నామంటారు. తమ జనాభాకు తగిన నిష్పత్తిలో తమకు రిజర్వేషన్ లభించడం తమ హక్కు అని వారి వాదన. భారత్ బంద్‌కు పిలుపు ఇవ్వడానికి ముందు తమను సంప్రదించలేదన్న ఆవేదన కూడా ఉంది.
6. క్రీమీ లేయర్ అంటే ఏమిటి? అది రిజర్వేషన్లకు ఎలా వర్తిస్తుంది?
రిజర్వుడు కేటగిరీలో సాపేక్షంగా ధనికులు, ఎక్కువ చదువుకున్నవారూ ఉన్న వర్గాలను క్రీమీ లేయర్ అంటారు. నిజంగా బలహీనంగా ఉన్న వర్గాలకు రిజర్వేషన్ లబ్ధి చేకూరాలన్న ఉద్దేశంతోనే ఈ పద్ధతిని ప్రవేశపెట్టారు. ప్రస్తుతానికి ఓబీసీల్లో ఉన్న ఈ పద్ధతిని ఎస్సీ ఎస్టీలకు కూడా వర్తింపజేయాలా అన్న అంశం మీద దశాబ్దాలుగా చర్చ జరుగుతూనే ఉంది, ఆ చర్చలు వివాదాస్పదంగానే ఉంటున్నాయి.
7. కోటాలో కోటా లేక వర్గీకరణ అంటే ఏమిటి?
ఒక కేటగిరీలో రిజర్వేషన్లు పెద్దగా పొందని కులాలకు నిర్దిష్టమైన కోటాను కేటాయించడాన్నే కోటాలో కోటా లేక వర్గీకరణ అని స్థూలంగా చెప్పవచ్చు.ఉదాహరణకు ఎస్సీలకు 16శాతం రిజర్వేషన్ ఉంటే అందులో 4శాతం వాటాను ఎస్సీ కులాలలోనే రిజర్వేషన్ లాభం ఎక్కువగా అందని కులాలకు నిర్దిష్టంగా కేటాయించడం అన్నమాట.
8. రిజర్వుడు కేటగిరీలలో సబ్-కోటా ఏర్పాటుకు ప్రాతిపదిక ఏమిటి?
రిజర్వేషన్లలో సబ్-కోటా (కోటాలో కోటా లేక రిజర్వేషన్ల వర్గీకరణ) ఏర్పాటు ఎంపరికల్ డేటా మీద ఆధారపడి జరగాలి. ఒక నిర్దిష్ట రిజర్వుడు కేటగిరీలో సాపేక్షంగా వెనుకబడిన లేదా పెద్దగా ప్రాతినిధ్యం దక్కని నిర్దిష్ట ఉపకులాలకు రిజర్వేషన్ ఫలాలు అందాలన్నదే దీని ప్రాతిపదిక.
ఆ డేటాలో సామాజిక-ఆర్థిక పరామితులు, చదువు, ఉద్యోగ అవకాశాల వంటి విషయాలను పరిగణనలోకి తీసుకుంటారు. అటువంటి డేటాతో సక్రమంగా సమర్ధించగలిగినప్పుడే కోటాలో కోటాను అమలు చేయాలని సుప్రీంకోర్టు తప్పనిసరి నియమంగా పెట్టింది. అప్పుడే నిజంగా అత్యంత బలహీన కులాలకు సరిగ్గా లబ్ధి చేకూరుతుంది.
9. కోటాలో కోటాకు ఉదాహరణలేమిటి?
క్రీమీలేయర్, నాన్-క్రీమీలేయర్‌గా ఒబిసిల వర్గీకరణ ప్రధాన ఉదాహరణ. దానివల్ల నాన్-క్రీమీలేయర్ కులాలకు రిజర్వేషన్ల లబ్ధి చేకూరింది. తమిళనాడులో ఎస్సీల్లో అరుంధతీయార్లకు ప్రత్యేకమైన సబ్-కోటా ఉంది.
10. సబ్-కోటాలపై తన తీర్పును సుప్రీంకోర్టు ఎలా సమర్ధించుకుంది?
రిజర్వుడు కేటగిరీలలో అంతరాలను పరిష్కరించుకోవడం రాష్ట్రాలకు అవసరమని చెప్పడం ద్వారా సుప్రీంకోర్టు తన తీర్పును సమర్ధించుకుంది. ఆ కులాల్లో మారుతున్న సామాజిక ఆర్థిక స్థితిగతులను ప్రతిఫలించేలా రిజర్వేషన్ విధానాలు రూపొందాలని కోర్టు స్పష్టం చేసింది. రిజర్వేషన్ కేటగిరీల్లో వర్గీకరణ (సబ్-కోటాల) ద్వారా, అత్యంత బలహీనమైన ఉపకులాలకు మరింత లాభం చేకూర్చేలా రిజర్వేషన్ ఫలాలు కచ్చితంగా అందేలా చూడడమే కోర్టు లక్ష్యం.
11. సుప్రీం తీర్పుకు ఏయే రాష్ట్రాలు ఎలా స్పందించాయి?
హర్యానా వంటి రాష్ట్రాలు ఇప్పటికే ఎస్సీ రిజర్వేషన్లలో సబ్-కోటాను అమలు చేసే దిశగా చర్యలు మొదలు పెట్టాయి. సమగ్ర సర్వేల ఆధారంగా, సరైన ప్రాతినిధ్యం లభించని కులాలకు నిర్దిష్ట శాతం రిజర్వేషన్‌ను కేటాయిస్తున్నాయి. మిగతా రాష్ట్రాలు సుప్రీం తీర్పు ప్రభావం తమతమ రాష్ట్రాల్లోని సామాజిక-రాజకీయ సందర్భాల్లో ఎలా ఉంటుందన్న విషయాన్ని అధ్యయనం చేస్తున్నాయి. వర్గీకరణ అమలు నిర్ణయం స్వచ్ఛందం. రాష్ట్రాలు రాజకీయ, సామాజిక అంశాలను పరిగణనలోకి తీసుకుని మార్పులు చేయవచ్చు.
12. వర్గీకరణ సీట్లు నిండకపోతే, వాటిని జనరల్ కేటగిరీలో నింపుతారా?
లేదు. వర్గీకరణ జరిగితే, ఆ తర్వాత ఆ సబ్-కోటాలో సీట్లు నిండకపోతే వాటిని ఎస్సీ కేటగిరీకి మార్చి, మిగతా ఎస్సీ కులాల అభ్యర్ధులతో నింపుతారు. వర్గీకరణ అనేది ప్రధానంగా ఆ కోటాలో అత్యంత బలహీన కులాలకు మొదటి ప్రాధాన్యం ఇస్తుంది. ఆయా పోస్టులకు ఆ కులాల నుంచి అభ్యర్ధులు లేకపోతే, వాటిని మిగతా ఎస్సీ కులాల వారితో నింపుతారు.
13. ఈ వర్గీకరణను రాష్ట్రప్రభుత్వాలు రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తే పరిస్థితి ఏంటి?
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం, సర్వే డేటా ప్రకారం అత్యంత బలహీనమైనవిగా గుర్తించబడిన కులాలను మాత్రమే సబ్-కోటాలో చేర్చవచ్చు. తగినంత సమాచారం లేకుండా కొన్ని కులాలకు ప్రత్యేక కోటా కేటాయించాలని కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు నిలువరించింది.
14. భారతదేశంలో రిజర్వేషన్ల వర్గీకరణ/కోటాలో కోటా భవిష్యత్తు ఏంటి?
రిజర్వుడు కేటగిరీలలోని అర్హత కలిగిన కులాలన్నింటికీ అవకాశాల్లో వాటికి తగిన వాటా దొరకడమే లక్ష్యంగా సమాచార ఆధారిత విధానాలను రూపొందించుకోవడం మీదనే ఈ వర్గీకరణ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. రాష్ట్ర, కేంద్ర స్థాయుల్లో వివిధ కులాల ప్రాతినిధ్యానికి డిమాండ్లు పెరిగే కొద్దీ ఈ కోటాలో కోటా పద్ధతి మరింత విస్తృతమవుతూ ఉంటుంది.