ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దివ్యాంగుల పింఛనుదారుల్లో అనర్హుల ఏరివేతకు చర్యలు చేపట్టింది. దివ్యాంగులు కాకున్నప్పటికీ దొంగ సర్టిఫికెట్లతో పింఛను తీసుకుంటున్నవారికి ప్రభుత్వ సాయాన్ని నిలిపివేయనుంది. నకిలీ సర్టిఫికెట్లతో పింఛను తీసుకునే వారిని తొలగించే ఏర్పాటు చేస్తున్నామని మంత్రి బాలవీరాంజనేయ స్వామి వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 8 లక్షల మంది దివ్యాంగులు పింఛను అందుకుంటున్నారు. చాలామంది బోగస్ సర్టిఫికెట్లు జతచేసి లబ్దిదారులుగా తమ పేరు నమోదు చేసుకున్నారని చెప్పారు. వారిని గుర్తించి ఇప్పటికే నోటీసులు పంపించినట్లు మంత్రి వివరించారు.
మళ్లీ సదరం క్యాంపులు నిర్వహించి మిగతా అనర్హులను గుర్తిస్తామని చెప్పారు. నిజమైన దివ్యాంగులు, అవసరమైన వారికే ప్రభుత్వ సాయం అందేలా చూస్తామన్నారు. దివ్యాంగ పెన్షన్ కోసం వచ్చే దరఖాస్తులను నిశితంగా పరిశీలించడంతో పాటు బోగస్ సర్టిఫికెట్లతో దాఖలు చేసే వాటిని ప్రాథమిక స్థాయిలోనే పక్కన పెట్టాలని అధికారులకు మంత్రి బాలవీరాంజనేయ స్వామి ఆదేశాలు జారీ చేశారు.