నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ మధ్య పొత్తు చర్చలు
జమ్ముకశ్మీర్ లో బ్యాలెట్ పోరుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడంతో రాజకీయ పార్టీలు విజయవ్యూహాల్లో మునిగిపోయాయి. రోజుకో తాజా ప్రకటనతో కార్యకర్తల్లో జోష్ నింపుతూ విజయం కోసం అప్పుడే కేడర్ ను సమాయత్తం చేస్తున్నాయి.
అధికరణ 370 రద్దుతో జమ్ముకశ్మీర్ లో అభివృద్ధి పనులు ముమ్మరంగా జరుగుతుండటం, ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డుకట్టవేయడం సహా ఇతర అంశాలు బీజేపీ నెగ్గేందుకు అవకాశం ఉందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. కేంద్ర నాయకత్వం కూడా జమ్ముకశ్మీర్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
తెలుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్యనేతలకు ఎన్నికల బాధ్యతలు అప్పగిస్తూ బీజేపీ అధినాయకత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే పార్టీ నిర్ణయం అమలులోకి వస్తుందని స్పష్టం చేసింది. తెలంగాణకు చెందిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో పాటు ఏపీ మూలాలు ఉన్న ఆ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ కు గెలుపు బాధ్యతలు అప్పగించింది.
కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి, గతంలో హోంశాఖ బాధ్యతలు కూడా నిర్వహించారు. ప్రస్తుతం గనుల శాఖ మంత్రిగా ఉన్నారు. తెలంగాణలో పలుమార్లు రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఎన్నికలు ఎదుర్కొన్న అనుభవం ఆయనకు ఉంది.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన నేతల్లో రామ్ మాధవ్ ఒకరు. అలాగే సంఘ్ కు సంబంధించిన పలు మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం ఆయనసొంతం.
రామ్ మాధవ్ 2014-20 కాలంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. జమ్ము కశ్మీర్, అసోం, ఇతర ఈశాన్య రాష్ట్రాల రాజకీయ వ్యవహారాలను నిర్వహించి బీజేపీ బలోపేతంలో కీలకంగా వ్యవహరించారు. 2015లో జమ్ము కశ్మీర్లో బీజేపీ పాలకపక్షంగా అవతరించడంలో ఆయన ముఖ్యపాత్ర పోషించారు. జమ్ముకశ్మీర్ లో ప్రాంతీయ పార్టీగా ఉన్న పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్రధారిగా వ్యవహరించారు.
సెప్టెంబర్ 26,2020న బీజేపీ ఆయనను ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించింది.జమ్ముకశ్మీర్ రాజకీయాలపై పట్టు ఉండటంతో పాటు స్థానిక చోటామోటా నేతలతో రామ్ మాధవ్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దానికి తోడు స్థానిక ఎన్జీవోలతోనే ఆయనకు ఉన్న పరిచయాలు పార్టీ గెలుపునకు దోహదపడే అవకాశముంది.
బీజేపీకి దీటుగా బదులిచ్చేందుకు నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్‌లు పొత్తు కుదుర్చుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల తరహాలోనే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ పొత్తు కుదుర్చుకోవాలని ఇరు పార్టీలు అంగీకారానికి వచ్చినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. సయోధ్య కుదిరితే మరో నాలుగైదు రోజుల్లో పొత్తులపై ప్రకటన వెలువడే అవకాశముంది.ఇరుపార్టీల హైకమాండ్ ఆదేశాల మేరకు చర్చల ప్రక్రియ ప్రారంభమైంది. డీలిమిటేషన్ కారణంగా చాలా అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాజకీయ సమీకరణలు మారిపోయాయి. దీంతో సిట్టింగ్-గేటింగ్ ఫార్ములా అనుకూలంగా ఉండకపోవచ్చు అని పలువురు రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
జమ్ము కశ్మీర్లో మూడు దశల్లో90 శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబర్ 18న తొలి దశ, 25న రెండోదశ, అక్టోబర్ ఒకటిన మూడో దశ ఎన్నికలు జరుగనుండగా మరుసటి రోజు అంటే అక్టోబర్ 4న ఫలితాలు వెల్లడవనున్నాయి.