కోటలూ, మహళ్ళ రాజరికంతో ఒప్పే అద్భుత రాష్ట్రం రాజస్థాన్. అక్కడి అపురూపమైన, చారిత్రక ప్రాధాన్యం కలిగిన వసంతగఢ్ కోట గుప్తుల కాలంలో నిర్మించినది. సిరోహి జిల్లాలో పిండ్వారా సబ్‌డివిజన్‌లో ఉన్న వసంతగఢ్ కోట, ఇన్నాళ్ళూ పట్టించుకునే నాథుడు లేక శిథిలావస్థలో కునారిల్లుతోంది. అయినప్పటికీ ప్రాచీన భారతీయ శిల్పకళా నైపుణ్యానికి సాక్ష్యంగా నిలబడి ఉంది.
రాజస్థాన్‌లో గుప్తుల కాలంలో నిర్మించిన ఒకేఒక కోట వసంతగఢ్ కోట. మేవాడ్ పరిపాలకుడు రాణా కుంభ ఈ కోటను 1400 ఏళ్ళ క్రితం నిర్మించారు. మేవాడ్‌ను ఆక్రమణదారుల నుంచి రక్షించుకోడానికి వ్యూహాత్మకంగా కట్టారు. ఈ కోటతో పాటు వసంతగఢ్‌లో ఎన్నో ప్రాచీన దేవాలయాలూ, మెట్లబావులూ ఉన్నాయి. స్థానికుల కథనం ప్రకారం సప్తర్షుల్లో ఒకరైన బ్రహ్మర్షి వసిష్ఠుడు నిర్మించిన ఊరు వసిష్ఠపూర్, కాలక్రమంలో వసంతగఢ్‌గా పేరు మారింది. అక్కడ మర్రిచెట్లు ఎక్కువగా ఉండడం వల్ల వటపూర్ అని కూడా పిలుస్తారు.
మేవాడ్ చరిత్రలో అత్యంత శక్తివంతుడూ, ప్రభావశీలీ అయిన రాజు రాణా కుంభా ఆ ప్రాంతాన్ని 1433 నుంచి 1468 వరకూ పరిపాలించాడు. వసంతగఢ్ కోటను ఆయనే నిర్మించాడు. ఆ కోట ఆరు కిలోమీటర్ల పొడవున, కొండ మీద వ్యాపించి ఉంటుంది. ఆక్రమణదారుల దాడులను తట్టుకునేలా, వారిపై ప్రతిదాడులు చేయడానికి వీలుగా, ఆ కోటను వ్యూహాత్మకంగా కీలక స్థానంలో దృఢంగా నిర్మించారు. భటేశ్వర్ కొండల మీద నుంచి ఆ కోట గోడలు, ఇతర నిర్మాణాలూ నేటికీ కనిపిస్తాయి. కానీ ఆ కోటను పరిరక్షించడానికి పెద్దగా చర్యలేవీ తీసుకోనందున ఆ చారిత్రక వారసత్వ సంపద మనుగడ ముప్పులో ఉంది.
ఇటీవల బసంతగఢ్ కోటలో ఒక ప్రాచీన శిలాశాసనం దొరికింది. అది విక్రమ సంవత్సరం 628, అంటే సామాన్య శకం 625లో వేయించిన శిలాశాసనం. రాజా వర్మలత్, భిన్మల్ రాజధానిగా మేవాడ్ నుంచి భిన్మల్ వరకూ వ్యాపించిన రాజ్యాన్ని పరిపాలించినట్లు ఆ శిలాశాసనం మీద ఉంది. వర్మలత్ ఆశ్రితుడైన సత్యదేవుడు అనే స్థానిక వ్యాపారి వసంతగఢ్‌లో క్షేమకరణి దేవాలయం నిర్మించాడు. ఆ మందిరం నేటికీ భటేశ్వర్ కొండల్లో చారిత్రక, సాంస్కృతిక చిహ్నంగా నిలిచి ఉంది.
వసంతగఢ్ గ్రామం రాణా కుంభ కంటె ముందునుంచే ఉందని స్థానిక నివాసి కిషన్‌సింగ్ రావ్ వెల్లడించాడు. ఆ కోటను మొదట మేవాడ్ రక్షణ కోసం నిర్మించారు. రాణా కుంభ దాని తర్వాత మౌంట్ అబూలోని అచల్‌గఢ్ దగ్గర 32వ కోట నిర్మించాడు. వసంతగఢ్ కోటలో ప్రముఖంగా కనిపించే విషయం గణపతి విగ్రహం. మొదట్లో ఆ మూర్తి ప్రధాన ద్వారం దగ్గర ఉండేది. దాన్ని తర్వాత కాలంలో భటేశ్వర్ మహాదేవ్ మందిర్ దగ్గరున్న శివాలయానికి మార్చారు. మినరల్స్ డిపార్ట్మెంట్ వారు అంబేమాతా మందిరం దగ్గరలో సర్వే చేసినప్పుడు ఆ ప్రాంతంలో రెండు సొరంగాలు ఉన్నట్లు బైటపడింది. వాటిలో రాగి నిక్షేపాలు ఎక్కువగా దొరికాయి. విదేశీ దురాక్రమణదారుల నుంచి తప్పించుకోడానికి ఆ సొరంగ మార్గాలు ఉపయోగపడి ఉంటాయని భావిస్తున్నారు.
చారిత్రక ప్రాధాన్యం కలిగిన వసంతగఢ్ కోట, అక్కడ లభించిన ప్రాచీన శిలాశాసనం రాజస్థాన్ సాంస్కృతిక వారసత్వ సంపదకు నిదర్శనంగా నిలుస్తాయి. ప్రస్తుతం కోట నిర్వహణ బాగోలేకపోయినా, అది శిల్పనిర్మాణ పరంగా, సాంస్కృతికపరంగా ప్రాచీన భారతదేశపు ఘనతను చాటిచెబుతుంది. అమూల్యమైన ఆ చారిత్రక సంపద మరింత పాడవకుండా రక్షించుకోవడం మన కర్తవ్యం.
వసంతగఢ్ కోట ఆనాటి కాలానికి చెందిన వ్యూహాత్మక రణతంత్ర పరాక్రమాన్ని మాత్రమే ప్రతిబింబించడం లేదు, ఆ ప్రాంతపు సాంస్కృతిక ఆధ్యాత్మిక మూలాలను సైతం ప్రతిఫలిస్తోంది. ఆ కోట చరిత్ర, నిర్మాణం, దానిచుట్టూ అల్లుకుని ఉన్న చారిత్రక కథలు వసంతగఢ్‌కు చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యతను తెచ్చిపెట్టాయి. ఆ వారసత్వ సంపదను పరిరక్షించుకోడానికి, పునరుద్ధరించడానికీ ప్రయత్నించడం ఎంతో అవసరం. భావి తరాలకు మన ఘన చరిత్రను చాటి చెప్పడానికి, రాజస్థాన్ చరిత్రలో గొప్ప అధ్యాయమైన వసంతగఢ్ కోట గురించి వివరించడానికీ దాన్ని కాపాడుకోవలసిన అవసరం ఎంతయినా ఉంది.