ఇజ్రాయెల్ హమాస్ ఉగ్రవాదుల మధ్య కాల్పుల విరమణకు తీవ్ర యత్నాలు జరుగుతోన్న వేళ ఆరుగురు బందీల మృతదేహాలు వెలుగు చూశాయి. దక్షిణ గాజాలో ఇజ్రాయెల్ సైన్యం చేపట్టిన ఆపరేషన్లో బందీల మృతదేహాలు కనుగొన్నట్లు ఐడిఎఫ్ ప్రకటించింది. అయితే వారిని ఎప్పుడు చంపారనే విషయం వెల్లడించలేదు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ ఇజ్రాయెల్‌లో పర్యటిస్తోన్న వేళ బందీలను చంపేయడం కాల్పుల విరమణ చర్చలకు విఘాతం కలిగే అవకాశం కనిపిస్తోంది.
గత ఏడాది అక్టోబరు 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై దాడికిదిగి రక్తపాతం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి మొదలైన యుద్ధంలో నేటి వరకు 40 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. బందీల్లో కొందరు చనిపోగా, మరికొందరిని హమాస్ ఉగ్రవాదులు విడిచిపెట్టారు. ఇంకా 110 మంది హమాస్ వద్ద బందీలుగా ఉన్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. బందీలను విడిపించడానికి సైన్యం చేస్తోన్న ప్రయత్నాలను ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు కొనియాడారు.