రైలు ప్రమాదాల నివారణకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో కూడిన సీసీటీవీ కెమెరాలను బిగించనున్నట్టు రైల్వే బోర్డు చైర్పర్సన్, సీఈవో జయ వర్మ సిన్హా ప్రకటించారు. అన్ని రైళ్ళు, కీలకమైన అన్ని రైల్వే యార్డుల వద్ద ఈ ప్రణాళికను అమలు చేయనున్నారు.
ప్రయాగ్రాజ్ రైల్వే జంక్షన్లో మీడియాతో మాట్లాడిన జయవర్మ సిన్హా, భద్రతా చర్యలను మెరుగుపరచడంలో ఏఐ సాంకేతికతతో కూడిన సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. అసాధారణ పరిస్థితులను గుర్తిస్తాయని వివరించారు.
వచ్చే ఏడాది కుంభమేళా నేపథ్యంలో సంఘవిద్రోహులు ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా నిరంతరం నిఘా ఉంచుతాయన్నారు. కుంభమేళా ప్రారంభానికి ముందే అవసరమైన మౌలిక సదుపాయాలు, విస్తరణ ప్రాజెక్టులు పూర్తవుతాయన్నారు. 2019 కుంభమేళా సందర్భంగా సుమారు 530 ప్రత్యేక సర్వీసులు నడిపిన విషయాన్ని గుర్తు చేశారు. 2025లో జరిగే కుంభమేళా కోసం దాదాపు 900 ప్రత్యేక రైళ్ళు నడపనున్నట్లు ప్రకటించారు.