దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో వైద్యుల రక్షణ ఏర్పాట్ల పరిశీలనకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. ప్రస్తుత చట్టాలు వైద్యుల రక్షణకు సరిపోవని వ్యాఖ్యానించిన సుప్రీం ధర్మాసనం, మరిన్ని భద్రతా చర్యలు అవసరమని పేర్కొంది. ఆర్జీ కర్ ఆసుపత్రి ట్రెయినీ డాక్టర్ హత్యాచారం కేసును విచారించిన సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం,మరో దారుణం జరిగేంత వరకూ దేశం వేచి ఉండలేదని వ్యాఖ్యానించింది .
హత్యాచారం ఘటనను నిరసిస్తూ శాంతియుత ఆందోళనలను అణచివేసే ప్రయత్నం సరికాదని పేర్కొంది. సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనంలో జస్టిస్ జేబీ పార్థీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా సభ్యులుగా ఉన్నారు.
సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ కు సర్జన్ వైస్ అడ్మిరల్ ఆర్ సరైన్ నేతృత్వం వహిస్తారని తెలిపిన సుప్రీం ధర్మాసనం, డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి, డాక్టర్ ఎం. శ్రీనివాస్, డాక్టర్ ప్రతిమా మూర్తి, డాక్టర్ గోవర్ధన్ దత్ పూరి, డాక్టర్ సౌమిత్ర రావత్, ఢిల్లీ ఎయిమ్స్ ప్రొఫెసర్ అనితా సక్సేనా, ముంబయి మెడికల్ కాలేజీ డీన్ ప్రొఫెసర్ పల్లవి సప్రే, ఎయిమ్స్ న్యూరాలజీ డాక్టర్ పద్మ శ్రీవాస్తవ సభ్యులుగా ఉంటారని తెలిపింది.
ఎక్స్ అఫీషియో మెంబర్లుగా కేంద్ర కేబినెట్ సెక్రెటరీ, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి, నేషనల్ మెడికల్ కమిషన్ చైర్ పర్సన్, నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినర్స్ ప్రెసిడెంట్ ఉంటారని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. మూడు నెలల్లో మధ్యంతర నివేదిక అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది.