దొంగల బడి. అందులో సీటు దొరకడం చాలా కష్టం. అవును మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లా కడియా, గుల్ జెడి, హుల్ఖేడి గ్రామాల్లో కొందరు గజదొంగలు నడుపుతోన్న దొంగతనాల శిక్షణ ఇచ్చే బడుల్లో సీటు దక్కించుకోవాలంటే చాలా కష్టం. ఈ బడుల్లో ఏడాది శిక్షణకు రూ.2నుంచి 3 లక్షల ఫీజు చెల్లించాలి. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, బిహార్ రాష్ట్రాల నుంచి కొందరు చదువులేని వారి పిల్లలను ఈ దొంగ బడుల్లో చేర్పిస్తున్నారు. ఒక్క ఏడాది రూ.3 లక్షలు ఖర్చు పెట్టుకుంటే ఆ తరవాత వారు ఏటా రూ.3 నుంచి రూ.5 లక్షలు సంపాదించిపెడతారు.
ఈ దొంగ బడుల్లో శిక్షణ పూర్తి చేసుకున్న వారిని కొందరు సంవత్సరానికి రూ.3 నుంచి రూ.5 లక్షలు చెల్లించి అద్దెకు తీసుకుంటున్నారు. ఇలా కొందరు గజదొంగల వద్ద పదుల సంఖ్యలో శిక్షణ పొందిన పిల్లదొంగలున్నారంటే వారి నేరాలు ఏ స్థాయికి వెళ్లాయో అర్థం చేసుకోవచ్చు.
పిల్లదొంగలు చేసిన దోపిడీలు చూస్తే పోలీసులకే మతి పోతోంది. ఇటీవల హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడి వివాహం జైపూర్‌లోని హయత్ హోటళ్లో చేశారు. ఆ పెళ్లిలో ఓ పిల్ల దొంగ కోటిన్నర విలువైన వజ్రాల నగ, లక్ష నగదు దోచుకోవడంతో వీరి పనితనం వెలుగులోకి వచ్చింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సీసీ పుటేజీ ఆధారంగా నేరుగా ఈ గ్రామానికి చేరుకుని దొంగను పట్టుకున్నారు.
మరో యువ దొంగ సిసోడియా ఇటీవల గుర్గావ్లో ఓ వివాహ కార్యక్రమంలో ఏకంగా నగల బ్యాగ్ చోరీ చేశాడు. అందులో రూ.2 కోట్ల విలువైన నగలున్నాయి. వెంటనే బాధితులు పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేయడంతో డొంక కదిలింది. రెండు రాష్ట్రాల పోలీసులు సమన్వయం చేసుకుని దొంగను పట్టుకున్నారు.
కడియా, గుల్జెడి, హుల్ఖేడి దొంగల గ్రామాల్లో పోలీసులు అడుగు పెట్టాలన్నా హడల్. ఎవరైనా కొత్త వ్యక్తి గ్రామంలో అడుగుపెట్టగానే అంతా అలర్ట్ అయిపోతారు. ముఖ్యంగా ఎవరి చేతిలోనైనా ఫోన్ కనిపించిందంటే పోలీసులు వచ్చారని గుర్తిస్తారు. వెంటనే అన్ని తలుపులు మూసి వేస్తారు. ఎవరిని ప్రశ్నించినా సమాధానం మాత్రం చెప్పరని స్థానిక పోలీసులు తెలిపారు. ఆ మూడు గ్రామాల్లో అడుగు పెట్టాలంటే పోలీసులు కూడా గుంపులుగా వెళ్లాల్సిందేనని మధ్యప్రదేవ్ డీజీపీ తెలిపారు.
కడియా, గుల్జెడి, హుల్ఖేడి ఈ మూడు గ్రామాల్లో 2 వేల జనాభా ఉన్నారు. వీరిపైన ఉన్న కేసులు ( crime news ) పరిశీలిస్తే నోరు వెళ్లబెట్టాల్సిందే. మొత్తం వీరిపై 8 వేల కేసులు ( national crime report) నమోదయ్యాయని పోలీసు అధికారులు తెలిపారు. ఈ గ్రామాల్లో దొంగతనాలు చేయడం అనేది తప్పుగా భావించడం లేదని పోలీసులు గుర్తించారు. దేశ వ్యాప్తంగా ఎక్కడ భారీ చోరీ జరిగినా ఈ గ్రామానికి లింకుంటుందని పోలీసులు చెబుతున్నారు. ఇంతకీ ఈ గ్రామాలు ఏ మారుమూలనో ఉన్నాయనుకుంటే పొరపాటే. మధ్యప్రదేశ్ రాజధానికి కేవలం 117 కి.మీ దూరంలోనే కడియా, గుల్జెడి, హుల్ఖేడి గ్రామాలున్నాయి.