బెంగాల్ ఘటన మరవక ముందే మహారాష్ట్రలోని థానేలో మరో అరాచకం వెలుగు చూసింది. ఓ ప్రైవేటు పాఠశాలలోని నాలుగేళ్ల విద్యార్థినులపై పారిశుద్ధ్య కార్మికులు లైంగిక దాడికి దిగారు. ఈ ఘటన తీవ్ర ఆందోళనకు దారితీసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
థానేలోని ఓ ప్రైవేటు ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఆగష్టు 16న ఇద్దరు బాలికలపై పారిశుద్ధ్య కార్మికుడు లైంగిక దాడి చేసినట్లు ఫిర్యాదు అందింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పాఠశాల ప్రిన్సిపల్, ఓ టీచర్, పారిశుద్ధ్య కార్మికుడిని పాఠశాల యాజమాన్యం సస్పెండ్ చేసింది.
పాఠశాల యాజమాన్యం తీరును నిరసిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు ఆందోళనకు దిగారు. సమీపంలోని బాదల్పూర్ రైల్వే స్టేషన్లో నిరసనకు దిగారు. దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిపివేశారు. పాఠశాల మరుగుదొడ్ల వద్ద మహిళా అటెండెంటు కూడా లేరని పోలీసులు గుర్తించారు. బడిలో చాలా భద్రతా లోపాలున్నట్లు పోలీసులు చెబుతున్నారు. కనీసం బడి ప్రాంగణంలో సీసీటీవీ కూడా లేదని తేలింది. బడిలో భద్రతా లోపాలపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు దిగారు.