గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో అదనపు బాధ్యత అప్పగించింది. ఇప్పటికే సామాజిక పింఛన్ల పంపిణీ బాధ్యతలు అప్పగించిన కూటమి ప్రభుత్వం తాజాగా మరో పని అప్పగించింది. ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల పరిశుభ్రత ఫొటోలు అప్ లోడ్ చేయాలని గ్రామ, వార్డు సచివాలయాలకు విద్యాశాఖ ఆదేశించింది.
ప్రతీ సోమ, గురువారాల్లో ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసిస్టెంట్, వార్డు ఎడ్యుకేషన్ కార్యదర్శి పాఠశాలలు సందర్శించాలని, మరుగుదొడ్ల ఫొటోలను తీసి అప్ లోడ్ చేయాలని వివరించింది. ఐఎంఎంఎస్ యాప్ లో లాగిన్ అయ్యేందుకు అవకాశం కల్పించింది.
ఇంతకు ముందు ఈ బాధ్యతలను ఉపాధ్యాయులు నిర్వహించే వారు. ప్రస్తుతం వారికి బదులు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఆ పని చేయాల్సి వస్తోంది.