మంకీపాక్స్ వేగంగా విస్తరిస్తోంది. అయితే మన దేశంలో ఇంత వరకు తాజాగా మంకీపాక్స్ కేసులు నమోదు కాలేదు. పొరుగు దేశం పాకిస్థాన్లో మంకీపాక్స్ కేసు వెలుగు చూడటంతో కేంద్రం అప్రమత్తమైంది. విమానాశ్రయాల్లో విదేశాల నుంచి వస్తున్న వారిపై నిఘా వేయాలని ఆదేశించింది. దీనిపై ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి పి.కె.మిశ్ర, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్ నౌకాశ్రయాల నుంచి వస్తున్న వారిపై కూడా నిఘా ఉంచాలన్నారు. ఇప్పటికే ఢిల్లీలో మూడు ఆసుపత్రులను నోడల్ ఆసుపత్రులుగా ప్రకటించారు. మంకీపాక్స్ గుర్తించిన వెంటనే రోగులను ఐసోలేషన్ చేయాలని ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మంకీపాక్స్ వైరస్ను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని కేంద్రం ఆదేశించింది. కొన్ని ఆసుపత్రులను గుర్తించి నోడల్ ఆసుపత్రులుగా సిద్దం చేయాలన్నారు. విదేశాల నుంచి వస్తున్న ప్రయాణీకుల ఆరోగ్యంపై నిఘా ఉండాలని ఆదేశించారు.
తాజాగా పాకిస్థాన్లో మరో కేసు నమోదైంది. జెడ్డా నుంచి పాక్ చేరుకున్న ప్రయాణీకుడికి మంకీపాక్స్ ఉన్నట్లు గుర్తించారు. దీంతో పాక్లో మంకీపాక్స్ కేసులు నాలుగుకు చేరుకున్నాయి.