ఆంధ్రప్రదేశ్ ఫైబర్‌నెట్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ మధుసూదన్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ఆర్సిపి హయాంలో ఫైబర్‌నెట్ కార్పొరేషన్లో పెద్దమొత్తంలో నిధులు దుర్వినియోగం చేసారన్న ఆరోపణలపై సస్పెన్షన్ వేటు వేసింది.
వైసీపీ హయాంలో మధుసూదన్‌రెడ్డి కేంద్ర రైల్వే అకౌంట్స్ సర్వీసెస్ నుంచి డెప్యుటేషన్ మీద వచ్చారు. ఆ గడువు 2024 ఆగస్టు 22తో ముగిసిపోతుంది. అయితే గత ప్రభుత్వ హయాంలో ఫైబర్‌నెట్ ఎండీ హోదాలో మధుసూదన్ రెడ్డి పలు అక్రమాలకు పాల్పడ్డారని వాటిపై విచారణ జరగాల్సి ఉన్నందున ఆయన డెప్యుటేషన్ మరో ఆరు నెలలు పొడిగించాలని కోరుతూ రాష్ట్రప్రభుత్వం రైల్వేశాఖను కోరింది.
మధుసూదన్ రెడ్డి తన హయాంలో చేసిన అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. తన అవినీతి వివరాలు బైటపడకుండా ఉండేందుకు రికార్డులు ట్యాంపర్ చేస్తున్నారని, సాక్ష్యాలు ధ్వంసం చేస్తున్నారని, ఫైబర్‌నెట్ ప్రస్తుత, మాజీ ఉద్యోగులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారనీ రాష్ట్రప్రభుత్వం ఆరోపించింది. అటువంటి ప్రయత్నాలను నిలువరించేందుకే మధుసూదన్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొంది. ఆయన అమరావతి విడిచిపెట్టి వెళ్ళకూడదంటూ జీవోలో పేర్కొంది.