కేరళలోని వయనాడ్‌లో ఇటీవల కొండచరియలు విరిగిపడి 4వందల మంది చనిపోయిన సంగతి తెలిసిందే. మరెన్నో వందల మంది నిరాశ్రయులయ్యారు. వారికి సాయం చేయడం కోసమంటూ వామపక్ష విద్యార్ధి సంస్థ డివైఎఫ్ఐ ఓ విచిత్రమైన కార్యక్రమం మొదలుపెట్టింది. ‘పోర్క్ ఛాలెంజ్’ పేరిట పందిమాంసం అమ్మింది. కొత్తమంగళంలో పోర్క్ విక్రయించాక, కాసరగోడ్ జిల్లా రాజాపురంలో కూడా అదే పని చేయడానికి సిద్ధపడింది. డివైఎఫ్ఐ ప్రారంభించిన ఆ ‘పోర్క్ ఛాలెంజ్’, స్థానిక ముస్లిములకు ఆగ్రహం కలిగించింది.
పంది మాంసం విక్రయించడం తమ మతపరమైన సెంటిమెంట్లను దెబ్బతీస్తుందంటూ పోర్క్ అమ్మడానికి ముస్లిములు అభ్యంతరపెట్టారు. పోర్క్ అమ్మగా వచ్చిన డబ్బులను వయనాడ్ ప్రకృతి బీభత్స బాధితులకు సహాయం చేయడానికి వాడతామని డివైఎఫ్ఐ ప్రకటించింది. కొత్తమంగళం, రాజాపురంలో మాత్రమే కాదు కేరళ రాష్ట్రమంతటా పోర్క్ అమ్మడం కొనసాగిస్తామని స్పష్టం చేసింది. అలా వచ్చిన డబ్బులతో వయనాడ్‌లో 25 ఇళ్ళను పునర్నిర్మించాలని డివైఎఫ్ఐ భావిస్తోంది.
డివైఎఫ్ఐ నిర్ణయాన్ని కేరళలోని ఇస్లామిక్ ఛాందసవాదులు ఆందోళణ వ్యక్తం చేసారు. ముస్లిం మత విశ్వాసాల ప్రకారం పందిమాంసం అమ్మడం నేరమని ముస్లిం మతగురువులు వాదించారు. వయనాడ్ విషాదంలో బతికి బట్టకట్టినవారిలో కొంతమంది ముస్లిములు పందిమాంసం తినరనీ, అలాంటి వారికి సాయం కోసం పోర్క్ విక్రయించి డబ్బులు సమీకరించడం ఆ బాధితులను అవమానించడమేననీ సున్నీ మతగురువు నాజర్ ఫైజీ కూడత్తయ్ అన్నారు. వయనాడ్ విలయం బాధితుల్లో అత్యధికులు ముస్లిములనీ, వారికి పందిమాంసం నిషేధమనీ ఆయన గుర్తు చేసారు. ఆ విషయం తెలిసి కూడా పోర్క్ అమ్మడం ద్వారా డివైఎఫ్ఐ నిధులు సమీకరించడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు.
మరో మతగురువు జియావుద్దీన్ ఫైజీ, సామాజిక మాధ్యమాల్లో ఇలా రాసుకొచ్చారు. ‘‘హరాం లేదా హలాల్ పద్ధతిలో సంపాదించిన వారినుంచి సహాయం తీసుకోవడం ముస్లిములకు నిషిద్ధం కాదు. ఆ నియమం అందరికీ వర్తిస్తుంది. మద్యం దుకాణం యజమానికి, బ్యాంకు మేనేజర్‌కు, పందిమాంసం విక్రేతకు కూడా వర్తిస్తుంది. అయితే, నిరుపేదలకు సహాయపడడానికి ఇటువంటి హరామీ ఛాలెంజ్ నిర్వహించడం అవసరమా? ఇప్పుడు పోర్క్ ఛాలెంజ్ అన్నారు. భవిష్యత్తులో బాధితులకు సహాయం పేరిట అధిక వడ్డీ ఛాలెంజ్, వ్యభిచారం ఛాలెంజ్, మద్యం ఛాలెంజ్, దొంగతనం ఛాలెంజ్ వంటివి కూడా చూస్తామా?’’ అని ప్రశ్నించారు. అయితే తర్వాత ఆయన తన ప్రకటనను ఉపసంహరించుకున్నారు.
ముస్లిముల విమర్శలకు కేరళ మంత్రి కెటి జలీల్ స్పందించారు. .‘‘ముస్లిములకు వడ్డీ కూడా హరామే. కానీ, పంది మాంసాన్ని వ్యతిరేకించే ఈ ఛాందసవాదులు, బ్యాంకుల విరాళాలను హరామ్ అని ఎందుకు అనడం లేదు? పోర్క్ తినడం కంటె, వడ్డీ ద్వారా సంపాదించే డబ్బును ఉపయోగించడం పెద్ద పాపం కాదా? మద్యం ముస్లిములకు నిషిద్ధం. కానీ క్రైస్తవులు, హిందువులకు మద్యం నిషేధం కాదు. మద్యం సేవించేవారు స్వర్గానికి వెళ్ళరు అని ఈ ఛాందసవాదులు చెప్పరు కదా’’ అంటూ జలీల్ మండిపడ్డారు.
వయనాడ్‌లో కొద్దిరోజుల క్రితం భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఆ ప్రమాదాల్లో 4వందల మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఎక్కువశాతం మంది ముస్లిములే. బాధితులకు సహాయం చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి.