షేక్ హసీనా రాజీనామా తర్వాత బంగ్లాదేశ్‌లో ఇస్లామిక్ అతివాద శక్తుల అరాచకాలకు అంతూపొంతూ లేకుండా పోతోంది. హిందూ మైనారిటీల మీద ప్రతీరోజూ దాడులు జరుగుతూనే ఉన్నాయి. విధ్వంసకాండ, లూటీలు, హిందూ మహిళలపై అత్యాచారాలు, సామూహిక అత్యాచారాలూ నిత్యకృత్యం అయిపోయాయి. మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొహమ్మద్ యూనుస్ హిందూ మైనారిటీల రక్షణకు హామీ ఇచ్చారు. కానీ అవి ఉత్త నోటిమాటలుగానే మిగిలిపోయాయి.
ఇప్పుడు ఇస్లామిస్టులు బంగ్లాదేశ్‌లోని వేర్వేరు పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న హిందువులను లక్ష్యం చేసుకున్నారు. అతివాద విద్యార్ధులు, ముస్లిములు కలిసి హిందూ టీచర్లు, ప్రొఫెసర్లతో బలవంతపు రాజీనామాలు చేయిస్తున్నారు. బంగ్లాదేశ్‌లోని వేర్వేరు జిల్లాల నుంచి అటువంటి సంఘటనలు గత కొద్దిరోజులుగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా జెస్సోర్ జిల్లాలో అలాంటి సంఘటన బైటపడింది.
కుకూ రాణి బిస్వాస్ అనే హిందూ ఉపాధ్యాయిని జెస్సోర్ నర్సింగ్ ఇనిస్టిట్యూట్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు. ఆగస్టు 18న ముస్లిం అతివాద విద్యార్ధులు ఆమెను ఘెరావ్ చేసారు. కుకూరాణి తన కార్యాలయంలో ఉండగా చుట్టుముట్టిన అతివాదులు ఆమెను ఐదు గంటల పాటు అక్కడి నుంచి కదలనివ్వలేదు. కుకూ రాణి తక్షణం తన ఉద్యోగానికి రాజీనామా చేయాల్సిందేనంటే వారు ఆమెను చుట్టుముట్టి ఘెరావ్ చేసారు.
ముస్లిం అతివాద విద్యార్ధులు కుకూ రాణి అవినీతిపరురాలు అని ఆరోపించారు. అందువల్లనే ఆమె రాజీనామా కోరుతున్నాం అని బైటకు కథలు చెప్పారు. అయితే ఆమె అవినీతి గురించి ఒక్క ఆధారమైనా లేకుండా, కనీసం ఎలాంటి దర్యాప్తు అయినా చేయకుండా ఆమెతో బలవంతంగా రాజీనామా చేయించారు.
బంగ్లాదేశ్‌లోని ముస్లిం అతివాద విద్యార్ధులు, ఆ దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల నుంచి హిందూ ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లు చాలామందితో ఇప్పటికే బలవంతంగా రాజీనామాలు చేయించారు. ఆ క్రమంలో కుకూ రాణి బిస్వాస్‌ది తాజా సంఘటన.