డాక్టర్ హత్య, అత్యాచారం ఘటనలో మరో కొత్తకోణం వెలుగు చూసింది. కోల్కతా ఆర్జీ కర్ ఆసుపత్రిలో అత్యాచారం, హత్యకు గురైన జూనియర్ డాక్టర్ డైరీలో ఓ పేజీ చినిగిపోయి ఉందని బాధితురాలి తండ్రి ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ చినిగిన ముక్క తన వద్ద ఉందని, అయితే అందులో ఏమి రాసి ఉంది అనే విషయాన్ని ప్రకటించవద్దని సీబీఐ ఆదేశించినట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆ డైరీలో చినిగిపోయిన పేజీ ముక్కలో ఏమి రాసి ఉందనే విషయంపై అనేక ఊహాగానాలు తెరమీదకు వచ్చాయి.
హత్య, అత్యాచారానికి గురైన డాక్టర్ బ్యాగులో డైరీ ప్రతి రోజూ ఉంచుకుంటుందని బాధితురాలి తండ్రి తెలిపారు. ఘటన జరిగిన తరవాత ఆ డైరీ ఇప్పుడు కీలకంగా మారింది. సహజంగా ఆమె డైరీని మేము ఏ నాడూ ముట్టుకోలేదని, ఆమెపై దురాగతం జరిగిన తరవాత మాత్రమే డైరీని పరిశీలించినట్లు బాధితురాలి తండ్రి వెల్లడించారు.