భారతభూమి పర్వదినాలకూ వేడుకలకూ పెట్టింది పేరు. వాటి లక్ష్యం మానవుల మధ్య బంధాలనూ బాంధవ్యాలనూ పెంచడం, మంచి ఆలోచనలను పదిమందితోనూ పంచుకోవడం. అటువంటి పర్వదినాల్లో శ్రావణ పూర్ణిమ ఒకటి. జంధ్యాల పున్నమిగానూ, రాఖీ పూర్ణిమగానూ జరుపుకునే పండుగ ఇది.
శ్రావణ పూర్ణిమ నాడు రాఖీ పండుగ జరుపుకునే ఆచారం వైదిక కాలం నుంచీ ఉంది. జీవన విలువలను రక్షించుకోడానికి సంకల్పం తీసుకునే పండుగ ఇది. రక్షాబంధనం అంటే రక్షణ కోసం బంధం. ముంజేతికి కట్టే ఆ బంధనం సోదరీసోదరుల పరస్పర విశ్వాసానికి, ప్రేమానురాగాలకూ నిదర్శనం. భారతీయ సంస్కృతికి విశిష్టమైన గుర్తింపునిచ్చే సూత్రం ఈ రక్షాబంధనం.
దేవాసుర యుద్ధంలో ఇంద్రుడికి దేవతల గురువైన బృహస్పతి శ్రావణపూర్ణిమ నాడు రక్ష కట్టి ఆశీర్వదించి యుద్ధానికి పంపించాడని, ఆ రక్షే ఇంద్రుడికి వరంగా నిలవడంతో ఇంద్రుడు యుద్ధంలో గెలిచాడనీ చెబుతారు. అప్పటినుంచే రక్షాబంధనం అనే సంప్రదాయం ఏర్పడిందని విశ్వసిస్తారు. మరో కథనం ప్రకారం దేవాసుర సంగ్రామం సమయంలో ఇంద్రుడికి భార్య శచీదేవి రక్ష కట్టి పంపించిందనీ, ఆ రక్ష ప్రభావంతో దేవతలు యుద్ధంలో గెలిచారనీ చెబుతారు.
భవి పురాణం ఉత్తరపర్వం 137వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు ధర్మరాజుకు రక్షాబంధనాన్ని ఆచరించే వైదిక విధి గురించి వివరిస్తాడు. ‘శ్రావణ పూర్ణిమ రోజు ఉదయమే దేవతలకు, పితృదేవతలకూ అన్ని వర్ణాల వారూ శ్రాద్ధకర్మ నిర్వహించాలి. అదేరోజు సాయంత్రం పట్టుపోగులు, పంటగింజలతో రక్ష తయారుచేసి, దాన్ని పురోహితుడు రాజు చేతికి కట్టాలి. ఆ తర్వాత అన్నివర్ణాల వారూ రక్షాబంధనం వేడుక జరుపుకోవాలి’ అని చెబుతాడు.
ఆధునిక కాలంలో ఈ పండుగ సమానత్వం, ఐకమత్యం, రక్షణ, ప్రేమ, అనురాగాలకు ప్రతీక. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘంలో జరుపుకునే ఆరు పండుగల్లో రక్షాబంధనం ఒకటి. సంఘ్ మొట్టమొదటి సర్సంఘ్చాలక్ డాక్టర్ హెడ్గేవార్ ఈ పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా చేసారు. సంఘంలో జరుపుకునే ఆరు పండుగల్లో రక్షాబంధన్ ఒకటి. సంఘ శాఖలో స్వయంసేవకులు అందరూ కలిసి ఒకరికొకరు రక్షాబంధనాలు కట్టుకుంటారు. తమ పరిసర ప్రాంతాల్లోని ఇళ్ళకు వెళ్ళి అందరికీ రాఖీలు కడతారు. ‘‘నేను నీకు రక్ష, నువ్వు నాకు రక్ష, మనిద్దరం దేశానికీ ధర్మానికీ రక్ష’’ అని ప్రమాణం చేస్తారు. సమాజంలోని సాధారణ ప్రజలను దుష్ట, అసాంఘిక శక్తుల నుంచి రక్షించడానికి స్వయంసేవక్ ఎన్నడూ వెనుకంజ వేయడు అని సంఘ రక్షాబంధనం ప్రతీకాత్మకంగా చెబుతుంది.
రాఖీ పండుగను దక్షిణాసియాలోని పలు దేశాల్లో జరుపుకుంటారు. భారతదేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకంగా ఈ పండుగ చేసుకుంటారు. పశ్చిమబెంగాల్లో దీన్ని ఝూలన్ పూర్ణిమ అంటారు. రాధాకృష్ణులకు పూజ చేసి, అక్కాచెల్లెళ్ళు అన్నాదమ్ములకు రాఖీ కడతారు. సమాజంలో సత్సంబంధాలు పెంచుకోడానికి రాజకీయ పక్షాలు, కార్యాలయాలు, స్నేహితులు, పాఠశాలలు, కళాశాలలు… ఇలా పలు ప్రదేశాల్లో రాఖీ ఉత్సవం చేసుకుంటారు.
మహారాష్ట్రలో చేపలు పట్టుకునే కోలీ తెగవారు ఈ పండుగ రోజునే నరాలీ పూర్ణిమ జరుపుకుంటారు. మత్స్యకార తెగల సంప్రదాయాల ప్రకారం వరుణ దేవుడికి పూజలు చేసుకుంటారు. ఆయనకు నైవేద్యంగా కొబ్బరికాయలు సమర్పించి, వాటిని సముద్రంలోకి విసిరేస్తారు.
జమ్మూ ప్రాంతంలో రక్షాబంధనం రోజు గాలిపటాలు ఎగరేస్తారు. రకరకాల ఆకృతుల్లో రకరకాల సైజుల్లో గాలిపటాలు తయారుచేసి వినువీధుల్లోకి పంపిస్తారు. హర్యానాలో రక్షాబంధన్‌ని ‘సలోనో’ పర్వదినంగా జరుపుకుంటారు. తమకు రక్ష కట్టి తమ మేలు కోరుకునే సోదరీమణులకు సోదరులు కానుకలు ఇస్తారు.
నేపాల్‌లో రక్షాబంధన్‌ను రిషితర్పణి అని వ్యవహరిస్తారు. అక్కడ హిందువులు, బౌద్ధులు ఇరుమతాల వారూ ఈ పండుగ రోజు రక్షాబంధనం కట్టుకుంటారు. దానికంటె ముందు యజ్ఞోపవీతం ధరిస్తారు.
ఇంక శ్రావణ పూర్ణిమ నాడు తప్పనిసరిగా చేయవలసింది ఉపాకర్మ అనే అచ్చమైన వైదిక సంస్కారం. అది లేకుండా రాఖీ పండుగ అసంపూర్ణంగా మిగిలిపోతుంది. వేదాధ్యయనం ప్రారంభించేవారు ఈ ఉపాకర్మ నియమాలను పాటిస్తారు.
శ్రావణ పూర్ణిమ నాడు స్నానం చేయడానికి శాస్త్రీయమైన పద్ధతి ఉంది. మట్టి, బూడిద, గోమయము, కుశలు, గరిక వంటి వాటితో స్నానం చేయాలి. ఆ పంచగవ్యాలు శారీరక ఆరోగ్యానికి మంచివని ఆయుర్వేదవం వివరిస్తోంది.
వేదకాలం నుంచీ ఆనవాయితీగా వస్తున్న రక్షాబంధన పర్వదినం ప్రమాదవశాత్తు, లేక తెలియనితనం వల్ల మనం చేసే చెడు పనుల ఫలితాలను తొలగించివేస్తుంది. అలాగే జీవితపు విలువలను రక్షించడానికి మనం కట్టుబడి ఉండాలని నిర్ణయం తీసుకుంటాం. ఈ పర్వదినం జరుపుకోవడం వల్ల భవిష్యత్తులో మంచి పనులు చేయగలుగుతాం.