ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో నేటితో శ్రావణమాసం ముగుస్తోంది. ఆఖరి శ్రావణ సోమవారం కావడంతో శివాలయాలకు భక్తులు పోటెత్తారు.
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో అచలేశ్వర మహాదేవుడి మందిరంలో పెద్దసంఖ్యలో భక్తులు దర్శనాలు చేసుకున్నారు. స్థానిక సంప్రదాయం ప్రకారం శ్రావణమాసపు ఐదవదీ, ఆఖరిదీ అయిన సోమవారం కావడంతో శివుడికి విశేష పూజలు చేసారు. మారేడు దళాలు, పూలదండలతో అలంకరించారు. క్షీరాభిషేకాలు చేసారు.
ఇవాళ రక్షాబంధన పర్వదినం కూడా కావడంతో సోదరీసోదరులు తమ బంధం బలంగా ఉండాలని శివభగవానుడికి పూజలు చేసారు. చాలామంది పరమశివుడికి రక్షాబంధనం సమర్పించారు.
ఉజ్జయినిలోని మహాకాళేశ్వరాలయం ఇవాళ తెల్లవారుజాము నుంచే భక్తులతో కిటకిటలాడిపోయింది. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన ఉజ్జయినికి ధార్మికంగా అమిత ప్రాధాన్యత ఉంది. శ్రావణమాసంలో మహాకాళేశ్వరుడిని అర్చించుకోడానికి దేశం నలుమూలల నుంచీ భక్తులు పెద్దసంఖ్యలో ఉజ్జయిని చేరుకున్నారు. నర్మదానదిలో పవిత్ర స్నానాలు ఆచరించి శివయ్యను దర్శించుకున్నారు.
ఝార్ఖండ్‌లోని దేవగఢ్‌లో వైద్యనాధుడి ఆలయంలో భక్తులు బారులు తీరారు. మరో జ్యోతిర్లింగ క్షేత్రమైన ఈ ప్రదేశంలో వైద్యనాధుడిగా వెలసిన పరమశివుడికి పూజలు చేసారు.
గుజరాత్‌లోని చారిత్రక సోమనాథ ఆలయంలోనూ భక్తుల సందడి ఘనంగా ఉంది. 1600 సంవత్సరాల పురాతనమైన ఆ ఆలయంలో శివుడు స్వయంభువుగా వెలిసాడు. ఆ రాష్ట్రంలో కూడా నేటితో శ్రావణమాసం ముగుస్తుండడంతో భక్తులు పెద్దసంఖ్యలో సోమనాధుణ్ణి దర్శించుకున్నారు. పర్వదినం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, ఆలయం వెలుపల జాతరలూ జరుగుతున్నాయి.
ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని నాగేశ్వరనాథ దేవాలయానికి కూడా భక్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. నమశ్శివాయ మంత్రజపంతో ఆలయం ఆవరణ అంతా శివమయమైపోయింది. శ్రావణ సోమవారం నాడు శివుణ్ణి అర్చిస్తే ఫలితం వెయ్యింతలుగా తిరిగి వస్తుందని భక్తుల విశ్వాసం.
హిందూ విశ్వాసాల ప్రకారం, సముద్రమథనంలో హాలాహలమనే విషం పుట్టినప్పుడు లోకాన్ని రక్షించడానికి పరమశివుడు ఆ గరళాన్ని తానే స్వీకరించాడు. దాన్ని కంఠంలోనే ఆపి, గరళ కంఠుడయ్యాడు. అలా ప్రపంచాన్నే రక్షించిన పరమశివుడికి కృతజ్ఞతగా భక్తులు ఉపవాసం ఉంటారు, ప్రత్యేక పూజలు చేసి ఆశీస్సులు తీసుకుంటారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు