తమిళనాడులో ఘోరం వెలుగు చూసింది. ఓ ప్రైవేటు పాఠశాల నిర్వాహకులు నకిలీ ఎన్సీసీ క్యాంపు నిర్వహించి, అందులో పాల్గొన్న 13 మంది బాలికలను లైంగిక వేధింపులకు గురిచేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
తమిళనాడు కృష్ణగిరి జిల్లాలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఎన్సీసీ క్యాంపు నిర్వహిస్తున్నామంటూ బాలికలు, బాలురను రాత్రి పూట కూడా అక్కడే ఉంచారు. ఈ క్యాంపులో 17 మంది బాలికలు సహా మొత్తం మొత్తం 41 మంది ఈ క్యాంపులో పాల్గొన్నారని పోలీసులు తెలిపారు. క్యాంపు నిర్వాహకులు బాలికలను ఆడిటోరియంలోకి పిలిచి లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పోలీసులు గుర్తించారు. ఈ విషయం యాజమాన్యానికి తెలిసినా,దాన్ని తొక్కిపెట్టేందుకు ప్రయత్నించారని కృష్ణగిరి జిల్లా ఎస్పీ తంగదురై తెలిపారు. సదరు పాఠశాలకు అసలు ఎన్సీసీ క్యాంపు నిర్వహించే అనుమతులే లేవని ఎస్పీ వెల్లడించారు.
ఈ ఘటనలో బాలికలు ప్రైవేటు పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని పోలీసులు తెలిపారు. ఇలాంటివి సహజమని పట్టించుకోవద్దంటూ వారికి నచ్చజెప్పారని విచారణలో తేలింది. 11 మంది నిందితులపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. జిల్లాలో ఇలాంటి నకిలీ ఎన్సీసీ క్యాంపులు ఇంకా ఎవరైనా నిర్వహించారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.