ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో నిర్భయ తరహా ఘటన చోటు చేసుకుంది. బస్సులో ప్రయాణించిన బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. బస్సుడ్రైవర్లు, కండక్టర్, క్యాషియర్ ఆ ఘాతుకానికి పాల్పడ్డారు. ఆగస్టు 12న జరిగిన ఆ దుర్ఘటనపై శనివారం ఫిర్యాదు చేసారు. దాని ఆధారంగా పోలీసులు నిందితులను అరెస్ట్ చేసారు.
ఈ నెల 12 అర్ధరాత్రి సమయంలో ఇంటర్-స్టేట్ బస్ టెర్మినల్ ప్లాట్ఫామ్ నెంబర్ 5 వద్ద ఒక మైనర్ బాలిక ఒంటరిగా ఉండడాన్ని గమనించిన స్థానికులు జిల్లా శిశు సంక్షేమ కమిటీకి సమాచారం ఇచ్చారు. కమిటీ సభ్యులు అక్కడికి చేరుకుని బాధితురాలిని బాలనికేతన్కు తరలించారు. అక్కడ కౌన్సిలింగ్ సమయంలో ఆమె విషయం చెప్పుకొచ్చింది.
దర్యాప్తులో బాధిత బాలిక యూపీలోని మొరాదాబాద్ తన నివాసం అని ఒకసారి, పంజాబ్ రాష్ట్రమని మరోసారి చెప్పింది. ఢిల్లీ-డెహ్రాడూన్ బస్సు గమ్యం చేరుకున్నాక ప్రయాణికులంతా దిగిపోయాక డ్రైవర్, కండక్టర్ ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత వేరే బస్సుల డ్రైవర్లు ఇద్దరు, డిపోలోని క్యాషియర్ ఒకడు ఘాతుకానికి పాల్పడ్డారు.
ఐదుగురు వ్యక్తులనూ పోలీసులు అరెస్ట్ చేసారు. దర్యాప్తులో భాగంగా వారిని విచారిస్తున్నారు.