సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన ఓ డాక్టర్ మాయగాళ్ల (cyber crime) ఉచ్చులో పడి ఏకంగా రూ.8.6 కోట్లు పోగొట్టుకున్నారు. తెలంగాణలో ఒక వ్యక్తి ఇంత పెద్ద మొత్తం పోగొట్టుకోవడం ఇదే మొదటిసారని పోలీసులు తెలిపారు. వారి వివరాల ప్రకారం.
హైదరాబాద్ కూకట్‌పల్లికి చెందిన ఓ డాక్టర్ ఫేస్బుక్ చూస్తుండగా స్టాక్ ట్రేడింగ్‌నకు సంబంధించిన పేజీ వచ్చింది. అది క్లిక్ చేశారు. ఆ తరవాత కొందరు వాట్సప్ మెసేజీలు పెట్టారు. తమ వద్ద పెట్టుబడులు పెట్టిన వారు నెలకు 20 నుంచి 30 శాతం లాభాలు తీసుకున్నారంటూ కొందరి వివరాలు పంపించారు. వెంటనే నాలుగు గ్రూపుల్లో డాక్టర్ నెంబరు యాడ్ చేశారు. ట్రేడింగ్ సంస్థ వివరాలు డాక్టర్ అడిగారు. అలాంటి వివరాలు ఇవ్వడాన్ని సెబీ నిషేధించిందని చెప్పారు. అది నిజమేనని నమ్మిన డాక్టర్ వారు పంపిన యాప్ లింకుల ద్వారా డబ్బు బదిలీ చేశాడు.
గత మే21న మొదలైన ట్రేడింగ్‌లో మొదట్లో లాభాలు వచ్చాయి. వాటిని డాక్టర్ తీసుకున్నాడు. దీంతో ఆయనకు నమ్మకం కుదిరింది. తరవాత 63 దఫాలుగా రూ.8.6 కోట్లు పెట్టుబడి పెట్టాడు. చివరకు తీసుకునే ప్రయత్నం చేయగా ఫలించలేదు. సైబర్ నేరగాళ్లకు ఫోన్ చేయగా 30 శాతం కమిషన్ ఇస్తేనే డబ్బు విడుదల అవుతుందని చెప్పారు. దీంతో మోసపోయినట్లు గ్రహించిన డాక్టర్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ నెల 12న డాక్టర్ ఫిర్యాదు అందుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు వేగంగా దర్యాప్తు చేశారు. డాక్టర్ ఖాతా నుంచి మూల్స్కు డబ్బు బదిలీ అయినట్లు పోలీసులు గుర్తించారు. మూల్స్ అంటే కమిషన్ తీసుకుని బ్యాంకు ఖాతాలు అరువుకు ఇవ్వడం. ఇలా దేశంలోని మారుమూల ప్రాంతాలకు చెందిన వృద్ధుల ఖాతాల్లో డబ్బు వేసి అక్కడ నుంచి నగదు డ్రా చేశారని పోలీసులు గుర్తించారు. కరీంనగర్‌కు చెందిన ఓ ఖాతాలో కూడా డబ్బు జమ అయినట్లు గుర్తించారు. విచారణ కొనసాగుతోంది.
సైబర్ నేరగాళ్ల ఎప్పటికప్పుడు ప్రణాళికలు మారుస్తున్నారని పోలీసులు హెచ్చరిస్తున్నారు. స్టాక్స్‌లో పెట్టుబడులు పెడితే కోట్లలో లాభాలు వస్తాయని, రివ్యూలు రాస్తే రోజుకు 10 వేలు వస్తాయని ఇలా రకరకాలుగా ప్రజలను మభ్యపెట్టి దోచుకుంటున్నారని పోలీసులు గుర్తించారు. ఫోన్లకు వచ్చే లింకులను కూడా క్లిక్ చేయవద్దని వారు హెచ్చరిస్తున్నారు.