దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన కోల్‌కతా ఆర్జీ కర్ ఆసుపత్రి వైద్యురాలి హత్య, అత్యాచారం కేసును సుప్రీంకోర్టు సుమోటాగా స్వీకరించింది. మంగళవారం నాడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ఈ కేసును విచారించనున్నారు. జూనియర్ డాక్టర్ హత్య కేసును సీబీఐ విచారిస్తోంది. నిందితుడికి ఇవాళ మానసిక పరీక్షలు నిర్వహించారు.
కోల్‌కతా ఘటనకు నిరసనగా వైద్యులు చేస్తోన్న నిరసనలు కొనసాగుతున్నాయి. ఇవాళ కూడా దేశ వ్యాప్తంగా వైద్యులు నిరసనలు తెలిపారు. ఆసుపత్రులను సేఫ్ జోన్లుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. నిందితుడిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు.
కోల్‌కతా ఘటన అటు అధికార టీఎంసీలోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. డాక్టర్‌పై అత్యాచారం జరిగిన మూడు రోజుల వరకు ఆ ప్రదేశానికి స్నిఫర్ డాగ్స్‌ను ఎందుకు తీసుకురాలేదంటూ సొంతపార్టీ నేతలే ప్రశ్నించడంతో కేసులో కొత్త వివాదం మొదలైంది.తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ రచనా బెనర్జీ ఇటీవల హత్యాచారానికి గురైన డాక్టర్ పేరును ప్రస్తావించడంపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పించారు. దీంతో ఆమె తనను క్షమించాలంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.