మహిళల అండర్19-2025 టీ20 ప్రపంచ కప్ టోర్నీ షెడ్యూల్‌ని ఐసీసీ ప్రకటించింది. టోర్నీకి మలేసియా ఆతిథ్యం ఇవ్వనుండగా జనవరి 18 నుంచి ఫిబ్రవరి 2 వరకు టోర్నమెంట్ జరగనుంది. మొత్తం 41 మ్యాచ్‌లు నిర్వహించనుండగా 16 జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు.
ప్రతీ గ్రూప్‌లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ సిక్స్ కు చేరతాయి. సూపర్ సిక్స్‌లోని రెండు గ్రూప్‌ల్లో టాప్-2లో నిలిచిన జట్లు సెమీస్ లో తలపడతాయి.
గ్రూప్ ఎలో భారత్, వెస్టిండీస్, శ్రీలంక, మలేసియా జట్లు ఉండగా గ్రూప్ బిలో ఇంగ్లాండ్, పాకిస్తాన్, ఐర్లాండ్, యూఎస్ఏ, గ్రూప్ సిలో న్యూజీలాండ్, సౌతాఫ్రికా, ఆఫ్రికా క్వాలిఫయర్, సమోవా, ఇక గ్రూప్ డిలో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఆసియా క్వాలిఫయర్, స్కాట్లాండ్ జట్లు ఉన్నాయి.
టోర్నీ సన్నద్ధత కోసం 16 వార్మప్ మ్యాచ్‌లను జరగనున్నాయి. మలేసియా, సమోవా తొలిసారి టోర్నీలో ఆడుతున్నాయి. సెమీ ఫైనల్ మ్యాచ్‌లకు ఫిబ్రవరి 1, ఫైనల్‌కు ఫిబ్రవరి 3 రిజర్వ్ డేగా నిర్ణయించారు. అండర్-19 స్థాయిలో ఇది రెండో టీ20 ప్రపంచకప్.
2023లో తొలిసారిగా నిర్వహించిన ఈ టోర్నీలో భారత్ విజయం సాధించింది. ఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై ఏడు వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది.గ్రూప్ దశలో టీమ్‌ఇండియా జనవరి 19న వెస్టిండీస్, 21న మలేసియా, జనవరి 23న శ్రీలంకతో ఆడనుంది.