జూనియర్ డాక్టర్ హత్య, అత్యాచారం ఘటన తరవాత దేశ వ్యాప్తంగా ఆందోళనలు మొదలైన సంగతి తెలిసిందే. కోల్‌కతా కేసు విచారణ సీబీఐకి అప్పగించారు. ఇక దేశ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని అధికారులను కేంద్ర హోం శాఖ ఆదేశించింది. ప్రతి రెండు గంటలకు సమాచారం మెయిల్, వాట్సప్, ఫ్యాక్స్ ద్వారా కేంద్ర హోం శాఖ ఢిల్లీలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌రూంకు పంపాలని ఆదేశించారు. ఇలా రెండు నెలలపాటు సమాచారం పంపాలని అన్ని జిల్లాల అధికారులను హోం శాఖ ఆదేశించింది.
కోల్‌కతా ఆర్జీ కర్ ఆసుపత్రి డాక్టర్ హత్య, అత్యాచారం తరవాత దేశ వ్యాప్తంగా వైద్యులు చేపట్టిన నిరసనలు రెండో రోజుకు చేరాయి. డాక్టర్లకే రక్షణ లేకుంటే రోగులను రక్షించలేమంటూ నిరసనలు తెలిపారు. డాక్టర్ హత్య కేసును వెంటనే తేల్చి, నిందితులను కఠనంగా శిక్షించాలంటూ పలు నగరాల్లో డాక్టర్లు ర్యాలీలు నిర్వహించారు.
కోల్‌కతా ఘటన తరవాత బెంగాల్ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. రాత్రి సమయాల్లో మహిళలకు డ్యూటీలు వేసేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భద్రతా చర్యలను పెంచింది. మహిళలు రాత్రి విధులు నిర్వహించే ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు, కనీసం ఇద్దరు మహిళలకు ఒక చోట రాత్రి విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని బెంగాల్ సీఎం ఆదేశించారు. ఇక రాత్రి మహిళలు విధులు నిర్వహించే ప్రాంతాల్లో వాలంటీర్లను కాపలాగా ఉంచాలని నిర్ణయించారు.