ఏలూరు నగరంలో ఘోరం జరిగింది. మూడు పోలీస్స్టేషన్లకు కూతవేటు దూరంలో ఓ మహిళపై భర్త ఉండగానే దుండగులు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
పెదవేగి మండలం విజయరాయికి చెందిన ఓ వ్యక్తి, భార్యతో సహా కూలి పనుల కోసం ఏలూరు వచ్చాడు. ఓ హోటల్లో పగలు పనిచేసుకుని, రాత్రి పూట ప్రదర్శనలు ఇచ్చే రామకోటి స్టేజీపై నిద్రిస్తుంటారు. అద్దె ఇంటికోసం ప్రయత్నిస్తున్నాడు. అయితే బుధవారం రాత్రి ముగ్గురు యువకులతో కలసి విజయరాయికి చెందిన వ్యక్తి కలసి మద్యం సేవించాడు. మత్తు బాగా ఎక్కిన తరవాత అతన్ని బెదిరించి, అతని భార్యపై అత్యాచారం చేశారు. అతను రోడ్డుపైకి పరుగులు తీసి కేకలు వేయడంతో ఓ యువకుడు రక్షించేందుకు వచ్చాడు. అంతలో దుండగులు పారిపోయారు.
ఆలస్యంగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులు చెంచుల పేటకు చెందిన నాగేంద్ర, పవన్, రంగారావుగా గుర్తించి అరెస్ట్ చేశారు. కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు.
100 నెంబరుకు కాల్ చేసినా పోలీసులు స్పందించలేదని బాధితుడు తెలిపారు. నగరం మధ్యలో మూడుపోలీస్ స్టేషన్లకు కూత వేటు దూరంలో సామూహిక అత్యాచారం జరిగినా పోలీసులు స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.