కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం ఘటనను ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. హాస్పిటల్స్ వద్ద సరైన భద్రత కల్పించాలని సిబ్బందికి సరైన రక్షణ కల్పించాలంటూ వైద్యులు చేపట్టిన ఆందోళనతో కేంద్రం అప్రమత్తమైంది. వైద్యుల నిరసనలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న కేంద్ర హోం మంత్రిత్వశాఖ, రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
వైద్యుల నిరసనలకు సంబంధించి ప్రతీ రెండుగంటలకు అన్ని రాష్ట్రాల్లో పరిస్థితిపై నివేదిక అందించాలని సూచించింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వైద్యుల ఆందోళనలు, శాంతిభద్రతల పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారం అందజేయాలని తేల్చిచెప్పింది.
ఫ్యాక్స్ లేదా ఈ-మెయిల్, వాట్సాప్ ద్వారా కేంద్ర హోంశాఖ కంట్రోల్ రూమ్‌కి సమాచారం అందించాలని తెలిపింది.
వైద్యురాలిపై హత్యాచారం కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. విచారణకు మరోసారి రావాలంటూ ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌కు సీబీఐ సమన్లు పంపింది. ఆయనను విచారణకు పిలవడం ఇది మూడో సారి. ఈ ఘటనకు సంబంధించి వైద్యులు, పోలీసు అధికారులతో సహా 40 మందిని ప్రశ్నించాలని భావిస్తున్న సీబీఐ అధికారులు ఇప్పటికే 20 మందిని ప్రశ్నించారు.