తిరుమల పరిపాలనా భవనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పలు కీలక ఫైళ్లు దగ్దం అయ్యాయి. దేవాలయాల పునరుద్దరణ, రోడ్లు నిర్మాణానికి సంబంధించిన అవినీతిని కప్పి పుచ్చేందుకే కొందరు అధికారులు ఫైళ్లు దహనం చేశారనే అనుమానాలొస్తున్నాయి. తిరుమలలో గత ఐదు సంవత్సారాలుగా జరిగిన పనులపై విచారణ సాగుతోంది. ఇందులో భాగంగా ఇటీవల విజిలెన్స్ విభాగం పరిపాలనా శాఖలో పనిచేసే డిప్యూటీ ఇంజనీరుకు నోటీసులు జారీ చేశారు. ఆ వెంటనే కార్యాలయంలో కీలక దస్త్రాలు కాలిపోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
తిరుమలలోని పరిపాలనా భవనం మొదటి అంతస్తు ఐదో గదిలో డీఈ కార్యాలయం పనిచేస్తోంది. ఇక్కడ పలు దేవాలయాల నిర్మాణం, రోడ్ల నిర్మాణాలకు సంబంధించిన దస్త్రాలు ఉన్నాయి. దాదాపు ఐదేళ్లలో రూ.300 కోట్లు ఖర్చు చేశారు. వీటి లెక్కల్లో తీవ్ర అవినీతి చోటు చేసుకుందనే విమర్శలు వస్తున్నాయి. అవినీతి వెలుగులోకి రాకుండా ఉండేందుకే దస్త్రాలు కావాలనే దహనం చేశారనే కోణంలో విజిలెన్స్ విచారణ జరుపుతోంది. కొన్ని దస్త్రాలు ఆన్లైన్ చేసినా, ఆ డేటా కూడా డిలీట్ చేశారని తెలుస్తోంది. తిరుమల కార్యాలయం దహనంపై సీఎం చంద్రబాబునాయుడు ఆరా తీశారు. విచారణకు ఆదేశించారు.