రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో శుక్రవారం మత ఉద్రిక్తతలు చెలరేగాయి. దాంతో నగరంలో ప్రజలు గుంపులుగా గుమిగూడవద్దంటూ నిషేధాజ్ఞలు జారీచేసారు. రెండు వేర్వేరు పాఠశాలలకు చెందిన విద్యార్ధులు ఘర్షణ పడి, వారిలో దళిత విద్యార్ధిని ముస్లిం విద్యార్ధి తండ్రి పొడిచేయడంతో ఈ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
బాధితుడు దేవరాజ్ మోచీ 15ఏళ్ళ విద్యార్థి. రంగ నివాస్‌లోని ప్రభుత్వ హయ్యర్ సెకెండరీ స్కూల్‌లో పదో తరగతి చదువుతున్నాడు. ఉదయ్‌పూర్‌లోని కిషన్‌పోల్ ప్రాంతంలో దివాన్ షా కాలనీలో నివసిస్తున్న జమాల్ షేక్ తండ్రి అయాన్ షేక్ అనేవాడు దాడికి పాల్పడ్డాడు.
సురాజాపోల్ స్టేషన్‌లో బాధితుడి పినతండ్రి వినోద్ మోచీ ఫిర్యాదు చేసాడు. దానిలోని వివరాల ప్రకారం శుక్రవారం ఉదయం 10.30 సమయంలో పాఠశాల బైట విద్యార్ధిపై దాడి జరిగింది. దేవరాజ్‌ను అయాన్ షేక్ ముందు చితకబాదాడు, తర్వాత కత్తితో అతని తొడ మీద పొడిచాడు. దాంతో తీవ్రంగా రక్తస్రావమైంది. ఆ విషయం తెలిసిన కుటుంబసభ్యులు దేవరాజ్‌ను అత్యవసర చికిత్స కోసం బడే హాస్పిటల్‌కు తీసుకువెళ్ళారు, అక్కడకు వెళ్ళేటప్పటికే దేవరాజ్ స్పృహ కోల్పోయాడు. ప్రస్తుతం దేవరాజ్ పరిస్థితి విషమంగా ఉన్నా, నిలకడగానే ఉంది.
కుటుంబసభ్యులు చెబుతున్న వివరాల ప్రకారం అయాన్ షేక్ చాలాకాలంగా దేవరాజ్‌ను వేధిస్తున్నాడు. కులం పేరు పెట్టి అసభ్యంగా తిడుతున్నాడు. దేవరాజ్‌పై వ్యక్తిగత కక్ష పెంచుకున్న అయాన్ షేక్, అతన్ని తరచుగా అవమానిస్తుండే వాడు. ఆ క్రమంలోనే ఈ దాడి చేసి ఉంటాడని వారు భావిస్తున్నారు. పోలీసులు నిందితుడి మీద భారతీయన్యాయసంహిత, ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్టాల ప్రకారం కేసు నమోదు చేసారు.
బాధిత యువకుడు మోచి కులానికి చెందినవాడు. ఆ కులానికి చెందిన యువత, ఇతర హిందూసంస్థల సభ్యులు ఉదయ్‌పూర్‌లో ఆందోళన ప్రదర్శన చేపట్టారు. నగరంలోని మార్కెట్లను, వాణిజ్య సంస్థలనూ మూయించివేసారు. కొన్నిచోట్ల ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. కొన్ని వాహనాలకు నిప్పుపెట్టారు. పరిస్థితులు అదుపు తప్పడంతో జిల్లా కలెక్టర్ ఉదయ్‌పూర్‌లో కర్ఫ్యూ విధించారు. ప్రజలు శాంతియుతంగా ఉండాలనీ, పుకార్లను నమ్మవద్దనీ జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి చేసింది.
బాధితుడి కుటుంబానికి మద్దతుగా పెద్దసంఖ్యలో ప్రజలు ఆస్పత్రి వద్ద గుమిగూడారు. మహిళలు రాత్రంతా హనుమాన్ చాలీసా పారాయణం చేసారు. ఆందోళనకారులు ‘భారత్‌మాతా కీ జై’ అంటూ నినాదాలు చేసారు. రక్షాబంధన్ పండుగకు ముందు ఈ దుర్ఘటన వెనుక మతఘర్షణలు రెచ్చగొట్టాలనే కుట్ర ఏమైనా ఉందా అన్న కోణంలోనూ విచారణ జరుగుతోంది.