పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం, హత్య ఘటన ఆ రాష్ట్రంతో పాటు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. దుశ్చర్యను నిరసిస్తూ గత ఎనిమిది రోజులుగా వైద్యులు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. విధులను బహిష్కరించి నిరసిస్తున్నారు. బాధిత వైద్యురాలికి న్యాయం చేయాలని నినదిస్తున్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు ఇవాళ 24 గంటల పాటు వైద్యులు సమ్మెకు దిగారు.
వైద్యుల సమ్మె నేపథ్యంలో రోగులు ఇబ్బందులు పడుతుండటంతో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. నిరసన చేస్తున్న వైద్యులు తక్షణమే ఆందోళన విరమించాలని కోరింది. వైద్యులు, ఇతర సిబ్బంది భద్రత కోసం ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన కేంద్రం, వైద్య సిబ్బంది భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై కమిటీకి సలహాలు, సూచనలు ఇవ్వొచ్చని తెలిపింది.
ప్రస్తుతం డెంగీ, మలేరియా కేసులు పెరుగుతున్నందున ప్రజా ప్రయోజనాలను దృష్ట్యా ఆందోళన విరమించి వెంటనే విధుల్లోకి చేరాలని కోరింది.