భారతదేశం సిరియాకు మానవతా సహాయంగా 1400 కేజీల యాంటీ-క్యాన్సర్ మందులను పంపించింది. ఆ విషయాన్ని విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటించింది.
‘‘భారతదేశం మానవత్వ దృక్పథంతో సిరియాకు సహాయం అందించింది. యాంటీ-క్యాన్సర్ మందులను పంపించింది’’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ శుక్రవారం నాడు ఎక్స్ మాధ్యమం ద్వారా వెల్లడించారు. ‘‘క్యాన్సర్ వ్యాధిపై పోరాడడానికి సిరియా ప్రజలకు, అక్కడి ప్రభుత్వానికీ సుమారు 1400 కేజీల మందులు సహాయపడతాయి’’ అని వివరించారు.
సిరియా, భారత దేశాల మధ్య ఎప్పటినుంచో సత్సంబంధాలు ఉన్నాయి. ఇరుదేశాల ప్రజలకూ ప్రగాఢ సంబంధాలు ఉన్నాయి. సిరియాలో సంక్షోభం నడుస్తున్న సమయమంతా ఆ దేశంలోని భారత దౌత్యకార్యాలయం తెరిచే ఉంది. ఎంతోమంది సిరియన్లు భారతదేశానికి పర్యటనకు, వైద్యచికిత్సలకు, వ్యాపార అవసరాల రీత్యా వస్తూంటారు.
అంతేకాదు, సిరియా యువతరానికి సామర్థ్యాల పెంపుదలలో భారతదేశం ఎంతగానో సహాయం చేసింది. ఐటిఇసి ప్రోగ్రాం కింద యేళ్ళ తరబడి శిక్షణా తరగతులు నిర్వహించింది, ఉపకార వేతనాలు అందించింది.
2024 మే నెలలో సిరియా ప్రథమ మహిళ అస్మా అసాద్కు లుకేమియా (రక్త క్యాన్సర్) ఉన్నట్లు వెల్లడైంది. పలు పరీక్షలు చేసిన తర్వాత అక్యూట్ మైలాయిడ్ లుకేమియా అని డాక్టర్లు నిర్ధారించారు. అంతకుముందు 2019లో ఆమె రొమ్ముక్యాన్సర్కు చికిత్స చేయించుకున్నారు.