ఏపీలోని ఏడు విమానాశ్రయాలను 14కు విస్తరించాలనేదే తన లక్ష్యమని కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు అన్నారు. రాజమహేంద్రవరం, విజయవాడ, కడప విమానాశ్రయాల్లో టెర్మినల్ సామర్థ్యం పెంపు పనులపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు సూచించారని తెలిపారు.
దిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో రామ్మోహన్ నాయుడు సమావేశం అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో కొత్త విమానాశ్రయాలు ఏర్పాటుకు భూమిని గుర్తిస్తే తమ శాఖ కూడా సహకారం అందిస్తుందన్నారు. శ్రీకాకుళం, దగదర్తి, కుప్పం, నాగార్జునసాగర్‌లో విమానాశ్రయాల ఏర్పాటుకు గుర్తించామన్నారు. కొత్త ప్రాంతాల్లో భూమి, సాంకేతిక అంశాలు పరిశీలించనున్నట్లు తెలిపారు.
పుట్టపర్తి విమానాశ్రయాన్ని ప్రభుత్వ సంస్థగా మార్చేందుకు ముఖ్యమంత్రితో చర్చించామన్నారు. ప్రైవేటు నిర్వాహకులతో మాట్లాడాల్సి ఉందన్నారు. పౌరవిమానయాన సంస్థగా మారిస్తే సాధారణ కార్యకలాపాలు సాగించవచ్చన్నారు. ఏపీని లాజిస్టిక్ హబ్‌గా చేయాలనేది చంద్రబాబు ఆలోచన అని, అందులో విమానాశ్రయాల పాత్ర కీలకమన్నారు.