78వ స్వతంత్ర దినం సందర్భంగా దేశమంతటా వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ క్రమంలోనే విధినిర్వహణలో అద్భుత ప్రతిభ చూపినందుకు కర్ణాటకలో 126 మంది పోలీసులకు ముఖ్యమంత్రి పతకాలు అందజేసారు. అయితే ఆ పతకాలు గెలుచుకున్న వారిలో సస్పెండైన వ్యక్తి ఒకరుండడం వివాదాస్పదమైంది.
సలీం పాషా మైసూరు సిసిబి యూనిట్లో హెడ్ కానిస్టేబుల్. గత నెలలో అతను సస్పెండయ్యాడు. అలాంటిది, అతన్ని ముఖ్యమంత్రి పతకాల గ్రహీతల్లో ఒకడిగా ఎంపిక చేయడం వివాదానికి దారి తీసింది. సలీం పాషా మీద తీవ్రమైన ఆరోపణలు ఉన్నందునే అతను సస్పెండ్ అయ్యాడు. కీలక పత్రాలను లీక్ చేయడం, నేరచరితులతో సన్నిహిత సంబంధాలు ఉండడం, ప్రభుత్వ ఆస్తుల దోపిడీలో పరోక్ష ప్రమేయం ఉండడం వంటి ఆరోపణల కారణంగా సలీం పాషా మీద డిపార్ట్మెంట్లో అంతర్గత దర్యాప్తు జరిగింది. ఆ దర్యాప్తులో, సలీం పాషాకు మెటగల్లి, విజయనగర పోలీస్ స్టేషన్ల పరిధిలో మాదకద్రవ్యాలు, దొంగతనాల వంటి కేసుల్లో నిందితుల బంధువులతో సంబంధాలున్నాయని తేలింది.
కొన్ని కేసుల్లో నిందితులు, వారి కుటుంబ సభ్యులతో సలీం పాషా ఫోన్ ద్వారా కాంటాక్ట్‌లో ఉన్నాడని, వారితో నిరంతరం సంభాషిస్తుండేవాడనీ దర్యాప్తులో తేలింది. దాంతో 2024 జులై 12న అతన్ని సస్పెండ్ చేసారు. అయినప్పటికీ 2023లో ఉత్తమ ప్రతిభ చూపినందుకు ముఖ్యమంత్రి పతకాలు ఇచ్చే పోలీసుల జాబితాలో సలీం పాషా పేరు కూడా చేరింది. దాంతో పురస్కార ప్రదాన ప్రక్రియ సమగ్రతపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సలీం పాషాకు ముఖ్యమంత్రి పతకం ప్రకటించడం పోలీస్ డిపార్ట్మెంట్లో వివాదాస్పదం అవడం మాత్రమే కాదు, రాజకీయ వర్గాల నుంచి సైతం తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. సస్పెండ్ అయిన కానిస్టేబుల్ పేరు ముఖ్యమంత్రి పతక జాబితాలో ఎలా చేర్చారని బిజెపి కర్ణాటక రాష్ట్రశాఖ అధ్యక్షుడు బివై విజయేంద్ర మండిపడ్డారు.
‘‘కొన్ని వర్గాలకు చెందిన వ్యక్తుల పేర్లను చూసినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు మూసుకుపోతాయి. మైసూరు నుంచి సస్పెండ్ అయిన కానిస్టేబుల్ పేరును స్వతంత్ర దినోత్సవాన ప్రదానం చేసే ముఖ్యమంత్రి పతకాల జాబితాలో చేర్చడం చూస్తుంటే నేరస్తులు, దొంగలు, ఆఖరికి ఉగ్రవాదుల గురించి కూడా ఎలాంటి ఆందోళనా లేదని తెలుస్తోంది’’ అని విజయేంద్ర ట్వీట్ చేసారు.
ముఖ్యమంత్రి పతకాల గ్రహీతలను ఎంపిక చేసే విధానాన్ని పారదర్శకం చేయాలని బిజెపి ఎంఎల్ఎ బసవన్న గౌడ పాటిల్ యాత్నాల్ డిమాండ్ చేసారు. పాషాకు అందజేసిన పతకాన్ని తక్షణం నిలిపివేయాలని పిలుపునిచ్చారు. ‘‘తీవ్రమైన తప్పుడు ప్రవర్తన కింద దర్యాప్తులో ఉన్నవారికి పతకాలు ఇస్తే, పోలీస్ శాఖ నైతిక స్థైర్యం ఏమైపోతుంది? ఆ పతకాన్ని వెనక్కి తీసుకోవాలి. పాషా మీద దర్యాప్తు వేగంగా జరిపించాలి’’ అని ఆయన డిమాండ్ చేసారు.
ఆ వ్యవహారం వివాదాస్పదం అవడంతో రాష్ట్రప్రభుత్వం ఆ ఘటనపై పెద్దగా నోరు విప్పలేదు. అయితే ప్రభుత్వ అధికారుల నుంచి స్పష్టమైన ప్రతిస్పందన లేదా వివరణ లేకపోవడంతో అటువంటి పురస్కారాలకు ఎంపిక ప్రక్రియలో మరింత పారదర్శకంగా వ్యవహరించాలన్న డిమాండ్లు బలం పుంజుకున్నాయి.