బిహార్‌లో తొమ్మిదేళ్లుగా నిర్మాణం జరుగుతోన్న వంతెన మరోసారి కూలిపోయింది. ఇప్పటికే మూడు సార్లు ఈ వంతెన నిర్మాణంలో ఉండగానే కూలిపోయింది. తాజాగా మరోసారి కూలింది. వివరాల్లోకి వెళితే.
బిహార్‌లోని ఖగారియా జిల్లా అగువాని సుల్తాన్‌గంజ్ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.1717 కోట్లతో గంగానదిపై 2015లో వంతెన నిర్మాణం ప్రారంభించింది. ఇది 2020 నాటికే పూర్తి కావాల్సి ఉంది. అయినా నేటికీ ఇంకా పూర్తి కాలేదు. 2022 డిసెంబరులో ఒకసారి కూలిన వంతెన, గత ఏడాది కూడా కొంత భాగం కూలిపోయింది.తాజాగా మరోసారి వంతెన కూలింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని తెలుస్తోంది.
వంతెన నిర్మాణం పూర్తికాకముందే మూడుసార్లు కూలడంపై నితీశ్ కుమార్ ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. వంతెన కూలిన ఘటనపై విచారణ జరుగుతోంది. నిర్మాణ కంపెనీ నుంచే నష్టాన్ని వసూలు చేస్తామని బిహార్ ప్రభుత్వం ప్రకటించింది.