మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (muda) పరధిలో స్థల కేటాయింపుల్లో జరిగిన అవకతవకలపై కర్ణాటక ముఖ్యమంత్రి, సిద్ధరామయ్య విచారణను ఎదుర్కొనున్నారు. ఈ కుంభకోణంలో ముఖ్యమంత్రిని విచారించేందుకు గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ అనుమతి ఇచ్చారు.
స్థల కేటాయింపుల్లో సిద్ధరామయ్య భార్య పార్వతమ్మకు మేలు చేశారంటూ సామాజిక కార్యకర్త స్నేహమయి ఫిర్యాదు చేయడంతో గవర్నర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ఆరోపణలకు ఏడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని, సీఎంపై ఎందుకు విచారణ జరపకూడదో తెలపాలని ఆదేశిస్తూ గత నెలలో ముఖ్యమంత్రికి గవర్నర్ షోకాజ్ నోటీసు జారీ చేశారు. దీంతో ప్రాసిక్యూషన్‌ను అనుమతించవద్దని గవర్నర్‌ను కోరుతూ రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేసింది. నోటీసును ఉపసంహరించుకోవాలని తీర్మానంలో పేర్కొంది. గవర్నర్ రాజ్యాంగ పదవిని దుర్వినియోగం చేస్తున్నారని సిద్ధరామయ్య ప్రభుత్వం ఆరోపించింది.
తన పై వస్తున్న ఆరోపణలను కొట్టిపారేసిన సిద్ధరామయ్య, కర్ణాటక సర్కారుపై బీజేపీ కుట్ర చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కుటుంబానికి ఎవరు, ఎలా ఆ భూములను కేటాయించారో తనకు తెలియదని పునరుద్ఘాటించారు. బీజేపీ హయాంలోనే ఈ కేటాయింపులు జరిగాయని గుర్తుచేశారు.
సిద్ధరామయ్య భార్య పార్వతికి మైసూరులోని కేసరే గ్రామం పరిధిలో 3 ఎకరాల భూమి ఉంది. దానని ఆమెకు సోదరుడు మల్లికార్జున్ బహుమతిగా ఇచ్చారు. ఈ భూమిని అభివృద్ధి కోసం ముడా స్వాధీనం చేసుకుంది. పరిహారం కింద దక్షిణ మైసూరులోని ప్రధాన ప్రాంతమైన విజయనగర్‌లో 38,283 చదరపు అడుగుల స్థలాన్ని కేటాయించింది. పరిహారం కింది ఇచ్చిన ప్లాట్ విలువ కేసరేలో ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న భూమికంటే ఎక్కువ అని బీజేపీ నేతలు ఆరోపించారు. దీంతో ముడా కుంభకోణం వెలుగులోకి వచ్చింది.
2013 అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధరామయ్య తప్పుడు అఫిడవిట్ సమర్పించారని ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. కేసరే గ్రామంలో మూడెకరాలకు పైగా ఉన్న వ్యవసాయ భూమి యాజమాన్య హక్కులు చూపడంలో విఫలమయ్యాయడని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
సిద్ధరామయ్య భార్య పార్వతి, ఆమె సోదరుడు మల్లికార్జు్న్‌పై మరో ఫిర్యాదు నమోదైంది. ప్రభుత్వం, రెవెన్యూ శాఖ అధికారుల సహకారంతో 2004లో మల్లికార్జున్ అక్రమంగా భూమిని సేకరించి నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.