వైసీపీ ముఖ్యనేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైసీపీ తరఫున మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగగా, ఎన్డీయే కూటమి పోటీకి దూరంగా ఉంది. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన షేక్ షఫీ నామినేషన్ ఉపసంహరించుకున్నారు. బొత్స సత్యనారాయణ ఒక్కరే పోటీలో ఉన్నారు. దీంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. బొత్సకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ధృవపత్రం అందజేశారు.
ఇటీవలి ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం వైసీపీ అభ్యర్థి గెలవడంతో ఆ పార్టీ కార్యకర్తల్లో ఆనందోత్సాహాలను నింపింది.
గతంలో వైసీపీ తరఫున స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా ఎన్నికైన వంశీకృష్ణ , ఆ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం జనసేన తరఫున కూటమి అభ్యర్థిగా శాసనసభకు ఎన్నికయ్యారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి వంశీకృష్ణ విజయం సాధించారు. ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి మళ్లీ ఎన్నిక నిర్వహించగా వైసీపీ తన ఖాతాలో వేసుకుంది.