పార్వతీపురం మన్యం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. బడికివెళ్లి తిరిగి వస్తోన్న ఇద్దరు ఉపాధ్యాయులు రాయిమాను వాగులో కొట్టుకుపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. పార్వతీపురం జిల్లా పాచిపెంట మండలం కొటికిపెంటలోని ఏకలవ్య పాఠశాలకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులు బుధవారం సాయంత్రం వాగులో కొట్టుకుపోయారని పోలీసులు తెలిపారు.
కొటికిపెంట పాఠశాలలో సదుపాయాలు లేకపోవడంతో సరాయివలస ఆశ్రమ పాఠశాలలో తరగతులు నిర్వహిస్తున్నారు. ఇటీవలే విధుల్లోకి చేరిన హర్యానాకు చెందిన ఆర్తి, మహేశ్ రాయిమానువాగులో కొట్టుకుపోయారు. బడి నుంచి తిరిగి వెళుతోన్న సమయానికి రాయిమానువాగు వరద ఒక్కసారిగా పెరిగింది. వాగు దాట వద్దని స్థానికులు హెచ్చరించినా వారికి భాష అర్థం కాకపోవడంతో నీటిలో దిగి కొట్టుకుపోయారు.
గమనించిన స్థానికులు కాపాడే ప్రయత్నం చేసినా ఫలించలేదు. ఆర్తి మృతదేహం వెంటనే లభ్యమైంది. ఉపాధ్యాయుడు మహేశ్ చెట్టుకొమ్మ పట్టుకుని ప్రాణాలు కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. చెట్టుకొమ్మ విరిగిపోవడంతో మహేశ్ వరదలో గల్లంతయ్యాడు. మహేశ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.