పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలోని ఆర్జీ కార్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ హత్య, అత్యాచారం ఘటనకు నిరసనగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు 24 గంటల డాక్టర్ల సమ్మె మొదలైంది. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు ఐఎంఏ ప్రకటించింది. కేవలం అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలిపింది. డాక్టర్లకు ముఖ్యంగా మహిళా డాక్టర్లకు రక్షణలేని పరిస్థితులు ఎక్కువుగా ఉన్నాయని ఐఎంఏ ఆందోళన వ్యక్తం చేసింది.
దేశ వ్యాప్తంగా 2 లక్షల మంది డాక్టర్లు వైద్యసేవలు నిలిపివేసి సమ్మెలో పాల్గొన్నారు. కేవలం అత్యవసర సేవలు మాత్రమే అందిస్తున్నారు. పలు నగరాల్లో నిరసనలు తెలుపుతూ ర్యాలీలు చేశారు. గడచిన ఐదు రోజులుగా ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ఆర్జీ కార్ ఘటన తరవాత నిరసన ముసుగులో కొందరు దుండగులు డాక్టర్ హత్య, అత్యాచారం జరిగిన ప్రదేశంలో సాక్ష్యాలు చెరిపే ప్రయత్నం చేశారంటూ కోల్కతా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బెంగాల్ పోలీసు వ్యవస్థ వైఫల్యాన్ని తప్పుపట్టింది.