వారాంతంలో స్టాక్ సూచీలు లాభాల్లో దూసుకెళ్లాయి. అంతర్జాతీయంగా అందిన సానుకూల సంకేతాలకుతోడు, దేశీయంగానూ టెక్ స్టాక్స్ ( Tech Stocks) కొనుగోలు చేసేందుకు పెట్టుబడిదారులు ఆసక్తి చూపారు. దీంతో ఒక్క రోజే పెట్టుబడిదారుల సంపద రూ.7 లక్షల కోట్లు పెరిగి, 444 లక్షల కోట్లకు పెరిగింది. ఇవాళ ఉదయం నుంచి స్టాక్ సూచీలు దూసుకెళ్లాయి. ఆసియా మార్కెట్లు భారీ లాభాలతో మొదలు కావడంతో ఓ దశలో సెన్సెక్స్ ( Sensex) 1400 పాయింట్లుపైగా పెరిగింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1331 పాయింట్లు పెరిగి 80436 వద్ద ముగిసింది. నిఫ్టీ ( Nifty) 397 పెరిగి 24541 పాయింట్ల వద్ద ముగిసింది.సెన్సెక్స్ 30 ఇండెక్సులో సన్‌ఫార్మా ఒక్కటే నష్టాల్లో ముగిసింది.టాటా స్టీల్, టాటా మోటార్స్, టీసీఎస్, ఇన్ఫోసిస్, రిలయన్స్, ఐటీసీ, ఎస్బీఐ, ఐసిఐసిఐ, ఏషియన్ పెయింట్స్ లాభాల్లో ముగిశాయి.
డాలరుతో రూపాయి మారకం విలువ 83.80 వద్ద ట్రేడవుతోంది. ముడిచమురు ధరలు స్వల్పంగా పెరిగాయి. బ్యారెల్ క్రూడాయిల్ 79.78 వద్ద ట్రేడవుతోంది. ఇక బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఔన్సు ప్యూర్ గోల్డ్ 2502 యూఎస్ డాలర్ల వద్ద లావాదేవీలు జరుగుతున్నాయి.