కేంద్రప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. కోల్కతాలో వైద్యురాలి హత్యచార ఘటనపై దేశవ్యాప్తంగా వ్యక్తం అవుతున్న ఆందోళనలు రోజురోజుకు తీవ్రం అవుతుండటంతో కేంద్రం ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆసుపత్రి వైద్యులు, వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలపై దాడి జరిగితే, ఆరు గంటల్లోగా పోలీసు కేసు నమోదు చేయాలని తెలిపింది. ఈ మేరకు అన్ని ఆసుపత్రులకు ఉత్తర్వులు పంపింది.
ఒకవేళ నిర్ణీత గడువులోగా ఫిర్యాదు అందకపోతే, సంబంధిత ఆసుపత్రి, సంస్థ అధిపతి బాధ్యత వహించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో కేంద్రం స్పష్టం చేసింది.
ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బందిపై దాడులు సర్వసాధారణంగా మారడం తమ దృష్టికి వచ్చిందని కేంద్రం పేర్కొంది. విధి నిర్వహణలో అనేక మంది ఆరోగ్య సిబ్బంది శారీరక హింసకు గురవుతున్నారని,మరికొందరికి బెదిరింపులు వచ్చాయని ఆదేశాల్లో పేర్కొంది. హింసలో ఎక్కువ శాతం రోగులు లేక రోగుల సహాయకుల ద్వారా ఎదుర్కొన్నవేనని మంత్రిత్వ శాఖ వివరించింది.
ఆసుపత్రిలో పనిచేసే వారికి మెరుగైన రక్షణ, సురక్షితమైన పని వాతావరణం కల్పించాలని కోరుతూ దేశవ్యాప్తంగా వైద్యులు, వైద్య విద్యార్ధులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.