తెలుగు రాష్ట్రాల్లో వరలక్ష్మీ వ్రత శోభ నెలకొంది. శ్రావణ మాసం శుక్ల పక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మీ వ్రతం జరుపుకోవడం సంప్రదాయంగా వస్తోంది. వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీ దేవిని కొలుస్తారు. సిరులు కురిపించి దారిద్ర్యాన్ని దూరం చేసే అమ్మవారిని వరలక్ష్మీ దేవిగా అలంకరించి పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రధాన ఆలయాల్లో సామూహిక వరలక్ష్మీ వత్రాలు నిర్వహిస్తున్నారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ వారు, శ్రీ వరలక్ష్మీ దేవి అలంకరణలో భక్తులను అనుగ్రహిస్తున్నారు. కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అనంతరం ఆలయంలో నిర్వహించే వ్రతం, ఇతర ప్రత్యేక పూజల్లో పాల్గొంటున్నారు.
తిరుపతి తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం నిర్వహించగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అర్చకులు భక్తులతో వ్రతం చేయించి వరలక్ష్మీ దేవి మహిమలు, వ్రత కథను భక్తులకు వివరించారు.
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు.అలాగే శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో వరలక్ష్మీ వ్రతం, సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపు లంకలో శ్రీముసలమ్మ అమ్మవారు ధనలక్ష్మీ దేవిగా భక్తులను అనుగ్రహించారు. అమ్మవారికి రూ.20 లక్షల విలువైన కరెన్సీ నోట్లతో అలంకరణ చేశారు. 2021 నుంచి ఇలా అలంకరిస్తున్నారు.