జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడులకు చెక్ పెట్టేందుకు కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన నళిన్ ప్రభాత్‌ను జమ్ముకశ్మీర్ కు పంపుతోంది. సెప్టెంబర్ 30న ప్రస్తుతం డీజీగా ఉన్న ఆర్ఆర్ స్వైన్ పదవీ విరమణ చేయనున్నారు. దీంతో నళిన్ ప్రభాత్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీ కేడర్‌కు చెందిన 1992 ఐపీఎస్ అధికారి నళిన్ ప్రభాత్(55).. ఆంధ్రప్రదేశ్‌లోని యాంటీ నక్సల్స్ ఫోర్స్ గ్రేహౌండ్స్‌లో కీలక పాత్ర పోషించారు. కశ్మీర్లో సీఆర్పీఎఫ్ ఆపరేషన్లను కూడా విజయవంతంగా నిర్వహించిన అనుభవం ఆయనకు ఉంది.
కేంద్రప్రభుత్వం నళిన్ ప్రభాత్‌ను మూడు పోలీస్ గ్యాలెంట్రీ మెడల్స్ తో గౌరవించింది. ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడంలో నళిన్ ప్రభాత్‌కు అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. సీఆర్పీఎఫ్లో ఇన్స్పెక్టర్ జనరల్, అడిషనల్ డైరెక్టర్ జరనల్ ఆఫ్ ఆపరేషన్స్‌గా సేవలందించారు.