ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మొదటిసారిగా ఉక్రెయిన్ బలగాలు రష్యాలోని సుద్జా పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నాయి. గురువారం నాడు కస్క్ ప్రాంతంలోని సుద్జా పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్వయంగా ప్రకటించారు. సుద్జాకు 45 కి.మీ దూరంలోని గ్లుస్కోవ్ పట్టణాన్ని ప్రజలు ఖాళీ చేసి వెళ్లిపోవాలని మేయర్ పిలుపునిచ్చారు. ఉక్రెయిన్ సేనలు వేగంగా గ్లుస్కోవ్ పట్టణం వైపు కదులుతున్నాయని దీని ద్వారా తెలుస్తోంది.
సుద్జాను స్వాధీనం చేసుకున్న ఉక్రెయిన్ సేనలు సమీపంలోని రష్యాకు చెందిన వైమానిక స్థావరాలపై బాంబుల వర్షం కురిపించాయి. ఇది రష్యాకు పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. రష్యా బలగాలు రెండున్నర సంవత్సరాలుగా సుదీర్ఘకాలం యుద్ధం చేసి భారీగా దెబ్బతిన్నాయనే వార్తలు వైరల్ అయ్యాయి. ఇదే సమయంలో ఉక్రెయిన్‌కు అంతర్జాతీయ సమాజం నుంచి మద్దతు లభిస్తోన్నట్లు స్పష్టమైంది.